Asianet News TeluguAsianet News Telugu

ఏడాదిన్నర చిన్నారిని చిధిమేసిన నిర్లక్ష్యం... యువకుడి ర్యాష్ డ్రైవింగ్ కు పాప బలి

ఓ యువకుడి ర్యాష్ డ్రైవింగ్ ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలను బలితీసుకుని తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిల్చింది.  ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

Rash driving kills child in santnagar
Author
Hyderabad, First Published Jun 27, 2022, 11:23 AM IST

హైదరాబాద్ : ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ముక్కుపచ్చలారని చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి కారు ఢీకొనడంతో మృతిచెందిన విషాదం తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా కూతురికి ఏలోటూ రాకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. 

వివరాల్లోకి వెళితే...  సనత్ నగర్ పరిధిలోని జింకలవాడ బస్తీలో అఖిల్ కుటుంబంతో కలిసి కొన్నేళ్ళుగా నివాసముంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపనీలో పనిచేస్తూ భార్యా, 14 నెలల కూతురు మోక్షితకు ఏలోటూ రాకుండా చూసుకుంటున్నారు. ఉన్నదాంట్లో సర్దుకుపోయి కుటుంబం ఆనందంగా జీవిస్తోంది. ఇలా హాయిగా సాగిపోతున్న వీరి జీవితంలో ఓ యువకుడి నిర్లక్ష్యం విషాదం నింపింది. 

ఆదివారం మధ్యాహ్నం మోక్షిత ఇంటిబయట ఆడుకుంటుండగా కొందరు యువకులు ఓ కారులో వచ్చారు. వీరిలో కొందరు అక్కడ దిగిపోగా మిగతావారు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో మహ్మద్ రసూల్ అనే యువకుడు కారు డ్రైవ్ చేస్తూ చిన్న గల్లీలో వేగంగా పోనిచ్చాడు. ఇలా అతడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇంటిబయట ఆడుకుంటున్న మోక్షితను ఢీకొట్టాడు. దీంతో చిన్నారి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.  

ప్రమాదం జరిగిన వెంటనే చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిని దగ్గర్లోని నీలోఫర్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చిన్నారి మృతిచెందింది. దీంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. 

బాలిక తల్లిదండ్రుల పిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా కారు నడుపిన రసూల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు పోలీసులు.  అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారణమైన అతడికి కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. అలాగే మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. 

ఇక ఇలాంటి దుర్ఘటనే హైదరాబాద్ నిజాంపేటలో చోటుచేసుకుంది. ఓ కారు ఢీకొట్టడంతో ముక్కుపచ్చలారని చిన్నారి బాలుడు బలయ్యాడు. మెదక్ జిల్లా పాపన్నపేట కు చెందిన నరేష్, జ్యోతి దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో వుంటున్నారు. నిజాం పేట పరిధిలోని కమ్మరి బస్తీలో 18 నెలల కొడుకు హర్షవర్ధన్ తో కలిసి దంపతులు నివాసముంటున్నారు.  

ఈ కుటుంబం అద్దెకుండే ఇంటికి సమీపంలో షిరిడి సాయిబాబా ఆలయం వుంది. ఈ ఆలయంలో సత్యనారాయణమూర్తి పూజారిగా పనిచేస్తున్నారు. ఆయన తనయుడు వీర అశ్విత్ (20) కాలనీలో కారు డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు. 

ఆలయ సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి హర్షవర్ధన్ ను అశ్విత్ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఢీకొట్టాడు. కారు ముందు టైర్ చిన్నారి తలపై నుండి దూసుకెళ్లింది. దీంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన చిన్నారిని తల్లిదండ్రుల దగ్గర్లోని కెపిహెచ్బి రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమింయడంతో డాక్టర్లు కూడా చిన్నారిని కాపాడలేకపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios