Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ డాక్టర్లు అదుర్స్ ... యువకుడి చెస్ట్ ను పూర్తిగా మార్చిపడేసారుగా..!

వైద్యరంగంలో హైదరాాబాద్ సత్తా ఏమిటో తెలియజేసే అరుదైన ఆపరేషన్ ను అమోర్ సూపర్ స్పెషాలిటి వైద్యులు నిర్వహించారు. దీంతో వైద్యపరంగా తెలంగాణ రాజధాని పేరు మరోసారి మారుమోగింది. 

Rare surgery performed at Amor Hospital Hyderabad AKP
Author
First Published Apr 13, 2024, 10:36 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్  మెడికల్ హబ్ గా మారింది. అంతర్జాతీయ స్థాయి సూపర్ హాస్పిటల్స్, నిపుణులైన వైద్యులకు హైదరాబాద్ లో కొదవలేదు. ఎలాంటి ఆరోగ్య సమస్య వున్నా హైదరాబాద్ లో చికిత్స పొందితే తగ్గుతుందన్న అభిప్రాయం తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు ఇతర ప్రాంతాలకు ఏర్పడింది. అందువల్లే దేశ నలుమూలల నుండి వైద్యం కోసం హైదరాబాద్ కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చివరకు పక్కరాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారంటే ఇక్కడి వైద్యం ఎంత అద్భుతంగా వుంటుందో అర్థమవుతోంది. తాజాగా అత్యాధునిక వైద్య వ్యవస్థలో హైదరాబాద్ ఏ స్థాయికి చేరుకుందో తెలియజేసే అరుదైన ఆపరేషన్ జరిగింది. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసి వైద్యరంగంలో హైదరాబాద్ టాప్ అని నిరూపించారు. 

అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ యువకుడు వైద్యం కోసం హైదరాబాద్ కు చేరుకున్నాడు. పుట్టుకతోనే ఎద భాగం బాగా లోపలికి నొక్కుకుపోయి వుండటంతో అతడి ఊపిరితిత్తుల పనితీరు కూడా దెబ్బతింది. దీంతో అతడు శ్వాస సమస్యతో బాధపడుతున్నాడు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు అనేక హాస్పిటల్స్ కు తిప్పినా ఫలితం లేకుండా పోయింది. దీంతో యువకుడితో పాటు అతడి శ్వాస సమస్య కూడా పెరుగుతూ వచ్చింది. ఇటీవల ఈ సమస్య మరీ ఎక్కువ కావడంతో హైదరాబాద్ లోని అమోర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆశ్రయించారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్ర చికిత్సతో యువకుడి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు.

సాధారణంగా పురుషుల ఎద భాగం సమతలంగా వుంటుంది. ఊపిరి తీసుకున్నపుడు గాలి లోపలికి వెళ్ళి ఎదభాగం కాస్త ముందుకు... ఊపిరి వదిలినపుడు లోపలికి వెళుతుంది. కానీ ఈ యువకుడికి మాత్రం ఎదభాగంతో పాటు ఊపిరితిత్తులు కూడా లోపలికి నొక్కుకుపోయినట్లు అమోర్ వైద్యులు గుర్తించారు. అతడి సమస్య చాలా సంక్లిష్టమైనది కావడంతో ఆపరేషన్ కూడా అంతే సంక్లిష్టంగా వుంటుంది... కానీ అతడిని మామూలుగా చేయడం అసాధ్యమేమీ కాదని వైద్యులు నిర్దారించారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అతడికి అరుదైన శస్త్ర చికిత్స చేసారు. 

ఆపరేషన్ ఎలా జరిగింది... 

'ముందుగా అత‌డి ప‌క్క‌టెముక‌ల‌ను క‌త్తిరించి, లోప‌ల అవ‌స‌ర‌మైన చోట మెట‌ల్ బార్లు, రిబ్ ప్లేట్లు పెట్టాం. ఈ మెట‌ల్ బార్ల‌ను ప‌క్క‌టెముక‌ల్లో రెండోదాని కింద‌, ఐదో ప‌క్క‌టెముక కింద పెట్టాల్సి వ‌చ్చింది. రెండు రిబ్ ప్లేట్ల‌ను కూడా పెట్టి వాటిని ప‌క్క‌టెముక‌ల‌కు స్క్రూల‌తో బిగించాం. రెండు ప్ర‌ధాన ఫ్లాప్ క‌వ‌ర్లు కూడా పెట్ట‌డం వ‌ల్ల ఎద భాగం మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి చేరుకుంది. అనంత‌రం చెస్ట్ డ్రెయిన్ కూడా పెట్టాం” అని అమోర్ హాస్పిటల్ ఎండీ డాక్ట‌ర్ కిశోర్ బి.రెడ్డి వివ‌రించారు.

యువకుడికి చేసిన ఈ సంక్లిష్టమైన శ‌స్త్రచికిత్స‌కు దాదాపు 9 గంట‌ల‌కుపైగా స‌మ‌యం ప‌ట్టిందని డాక్టర్ కిశోర్ తెలిపారు. ఇందులో ప్ర‌ధానంగా కార్డియోథొరాసిక్, వాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ కె. అరుణ్‌, ప్లాస్టిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అభినంద‌న్, ఐసీయూ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ జె.శ్రీ‌నివాస్‌, ఎమ‌ర్జెన్సీ వైద్య నిపుణుడు డాక్ట‌ర్ జ‌య‌శేఖ‌ర్, అనెస్థ‌టిస్టులు డాక్ట‌ర్ ప్ర‌త్యూష‌, డాక్ట‌ర్ మ‌హేష్‌, ఇంకా రీహాబిలిటేష‌న్ బృందం పాల్గొన్నట్లు తెలిపారు. డాక్టర్లతో పాటుఆప‌రేష‌న్ థియేట‌ర్ సిబ్బంది, ఐసీయూ సిబ్బంది, న‌ర్సులు సైతం అత‌డు కోలుకోవ‌డానికి స‌హాప‌డ్డారని తెలిపారు. వీరంద‌రి సమిష్టి నైపుణ్యం, నిబ‌ద్ధ‌త వ‌ల్లే శ‌స్త్రచికిత్స పూర్తిగా విజ‌య‌వంతం కావ‌డం, రోగి వేగంగా కోలుకోవ‌డం సాధ్య‌మైందని డాక్టర్ కిశోర్ తెలిపారు.

శ‌స్త్రచికిత్స నుంచి కోలుకున్న త‌ర్వాత రోగికి ప‌ల్మ‌న‌రీ ఫంక్ష‌న్ టెస్టు చేయ‌గా  పూర్తి సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయన్నారు. అత‌డు ఎలాంటి ఇబ్బంది లేకుండా న‌డ‌వ‌డంతో పాటు త‌న ప‌నులన్నీ చేసుకోగ‌లుగుతున్నాడని డాక్ట‌ర్ కిశోర్ బి.రెడ్డి తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios