Asianet News TeluguAsianet News Telugu

ఊపిరితిత్తుల్లోకి సూది.. అరుదైన శస్త్ర చికిత్స చేసిన గాంధీ వైద్యులు

డ్రగ్ ఎక్కించేందుకు వినియోగించే కాన్యులా (సన్నటి సూది) విరిగి ఊపిరితిత్తిలోకి పోయి చనిపోయేస్థితికి రావడంతో.. గాంధీ వైద్యులు ఆపరేషన్ చేసి విరిగిన సూది ముక్కను బయటకు తీశారు. 

rare surgery for youth in gandhi hospital
Author
Hyderabad, First Published Oct 27, 2018, 1:53 PM IST

ఓ క్లినికల్ ల్యాబ్ మందుల పరీక్షలకు ఒప్పుకొన్న ఓ యువకుడు.. చావుదప్పి కన్నులొట్టబోయిన చందంగా గాంధీ హాస్పిటల్ వైద్యుల సాయంతో బతికి బయటపడ్డాడు. డ్రగ్ ఎక్కించేందుకు వినియోగించే కాన్యులా (సన్నటి సూది) విరిగి ఊపిరితిత్తిలోకి పోయి చనిపోయేస్థితికి రావడంతో.. గాంధీ వైద్యులు ఆపరేషన్ చేసి విరిగిన సూది ముక్కను బయటకు తీశారు. నాలుగునెలలుగా యాతన అనుభవిస్తున్న ఆ యువకుడికి విముక్తి కల్పించారు. కాగా, ఇలాంటి శస్త్రచికిత్స జరుపడం వైద్యచరిత్రలో ఇదే తొలిసారని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెప్తున్నారు.

 బాధితుడు, గాంధీ హాస్పిటల్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగర శివారులోని ఐజెంట్ క్లినికల్ రిసెర్చ్ ల్యాబ్ తమ ఔషధాలను పరీక్షించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వాడయ్య (31)తో ఒప్పందం కుదుర్చుకొన్నది. కొవ్వాడయ్యకు డ్రగ్ ఎక్కిస్తుండగా ఔషధం శరీరంలోకి పంపేందుకు వినియోగించే కాన్యులా ఒత్తిడి ఎక్కువై రెండు ముక్కలైంది. 

రక్తంతో కలిసి సూది ముక్క ఊపిరితిత్తిలోకి వెళ్లింది. దాంతో ఛాతి భాగంలో నొప్పి, దగ్గుతో యాతన అనుభవిస్తూ చికిత్స నిమిత్తం పలు హాస్పిటల్స్ చుట్టూ తిరిగాడు. 

చివరకు ఈ నెల 18వ తేదీన సికింద్రాబాద్ గాంధీ దవాఖాన వైద్యులను సంప్రదించి కార్డియోథోరాసిక్ విభాగంలో పరీక్షలు చేయించుకోగా ఊపిరితిత్తిలో కాన్యులా ముక్క కనిపించింది. 

వెంటనే కార్డియోథొరాసిక్ వైద్యులు, అనస్తీషియా స్పెషలిస్టులు రెండుగంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి సూది ముక్కను బయటకుతీశారు. ప్రస్తుతం కొవ్వాడయ్య కోలుకొంటున్నాడు. ఈ సందర్భంగా కొవ్వాడయ్య మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ వైద్యులు తనకు ఆపరేషన్ చేసి మరో జన్మనిచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ లో ఇంత బాగా చూసుకొనే డాక్టర్లు ఉండటం ప్రజల అదృష్టమని, ఇక్కడి వైద్యులందరికీ రుణపడి ఉంటానన్నారు.

rare surgery for youth in gandhi hospital

ఆపరేషన్ చేసేందుకు రూ.6-10 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పిన ప్రైవేట్ హాస్పిటల్స్.. తన ప్రాణానికి మాత్రం భరోసాను ఇవ్వలేకపోయాయని విచారం వ్యక్తంచేశాడు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్, సీటీ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ రవింద్రా, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ కానాల, డాక్టర్ బెనడిటా, అనస్తీషియా స్పెషలిస్టులు డాక్టర్ భానులక్ష్మీ, డాక్టర్ మాధవితోపాటు ఆర్‌ఎంవోలు డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ శేషాద్రి, నర్సులు సునిత, సువర్ణ, నీలవాణి తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios