హైద్రాబాద్ పాతబస్తీలో రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్: ఏడు గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశం
హైద్రాబాద్ నగరంలోని పాతబస్తీలో రాత్రి ఏడుగంటటలకే దుకాణాలు మూసివేయాలని సోలీసులు ఆదేశించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలను విధించారు. పాతబస్తీలో రాత్రి ఏడు గంటలకే దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.
బీజేపీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో నేపథ్యలో పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 22 వ తేదీ రాత్రి నుండి 23 వ తేదీ ఉదయం వరకు హైద్రాబాద్ సీపీ కార్యాలయం ముందు ఎంఐఎం నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం నాడు ఉదయం పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మంగళవారం నాడు రాత్రి నుండి పాతబస్తీలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు సాగుతున్నాయి. బుధవారం నాడు ఉదయం కూడా పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్లజెండాలు చేతబూని ఆందోళన చేశారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.
పాతబస్తీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. దీంతో పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ రంగంలోకి దిగింది. శాలిబండ్ నుండి ఆలియాబాద్ వరకు సుమారు ఏడు కిలోమీటర్ల మేర ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. రాత్రి ఏడు గంటలకే దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.
రాత్రి ఏడు గంటలకే పాతబస్తీలో దుకాణాలను మూయించివేశారు పోలీసులు. పాతబస్తీలో కేంద్ర బలగాలను బారీ గా మోహరించారు. మీర్ చౌక్, చార్మినార్, గోషామహల్ జోన్ల పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పాతబస్తీలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని హైద్రాబాద్ పోలీసులు ప్రకటించారు. పాతబస్తీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు.
పది నిమిషాల నిడివితో ఉన్న వీడియోను రాజాసింగ్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో ఈ వివాదం చోటు చేసుకొంది.ఈ వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలున్నాయని ఎంఐఎం ఆరోపిస్తుంది. మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయని ఎంఐఎం ఆరోపణలు చేస్తుంది.ఈ విసయమై రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నుండి రాజాసింగ్ ను బీజేపీ నిన్న సస్పెండ్ చేసింది. బీజేపీ శాసనసభపక్ష పదవి నుండి కూదా తప్పించింది. ఈ వ్యాఖ్యల విషయంలో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. సెప్టెంబర్ 2 లోపుగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కూడా బీజేపీ నాయకత్వం రాజాసింగ్ ను ఆదేశించింది
రాజాసింగ్ వీడియో నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం నాడు చర్చించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సహాల పలువురు పోలీసు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు సీఎం కేసీఆర్ సూచించారు.