అతడో ప్రభుత్వోద్యోగి. యాబై ఏళ్ళకు పైబడి వయసుంటుంది.  మరికొన్నేళ్లలో రిటైరై మనవలు, మనవరాళ్లతో ఆడుకుంటూ శేషజీవితాన్ని గడపాల్సిన వయసులో కామంతో కళ్లుమూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. మనవరాలి వయసున్న విద్యార్థినిపై కన్నేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అతడి నుండి తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా  ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలోని  ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. ఇటీవలే పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవగా ఆమె ఓ ప్రైవేట్ పాఠశాలలో పరీక్షలు రాస్తోంది. అదే పరీక్ష సెంటర్ లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇన్విజిలేటర్ వ్యవహరిస్తున్నాడు. ఇతడు రోజూ ఒంటరిగా పరీక్ష కేంద్రానికి వస్తున్న బాలికను గమనించాడు. 

దీంతో అతడికి పాడుబుద్ది కలిగింది. బాలికను ఎలాగైనా అనుభవించాలని ఓ పథకం వేశాడు. పరీక్ష కేంద్రంలో ఆమెకు సహకరిస్తూ మచ్చిక చేసుకున్నాడు. దీంతో అతడిని బాలిక నమ్మింది. ఇలా ఓ పథకం ప్రకారం ఆమెకు దగ్గరైన అతడు ఇక తన కామ వాంఛ తీర్చుకోవాలని భావించాడు. ఇలా బుధవారం పరీక్ష ముగిసిన తర్వాత ఇంటి వద్ద వదిలిపెడతానని చెప్పి బాలిక తన బైక్ పై ఎక్కించుకున్న అతడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 

దీంతో బాలిక అతడి నుండి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి చేరుకుంది. తనపై జరిగిన అత్యాచారయత్నం గురించి పెద్దమ్మకు చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో వారు సదరు కీచక టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు ఉపాధ్యాయుడి తరపు వారు బాలిక కుటుంబ సభ్యులను నచ్చజెప్పి కేసు పెట్టకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది.