హైదరాబాద్: హైదరాబాద్ లోని మూసాపేటలో దారుణం చోటుచేసుకుంది. ఒంటిపై వున్న బంగారు నగల కోసం ఓ మహిళను నమ్మించి మోసం చేశాడో కసాయి.  నగలను దోచుకోవడమే కాదు మహిళపై అత్యాచారానికి పాల్పడి అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించాడు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాధిత మహిళ భర్తతో విబేధాల కారణంగా తన తల్లితో కలిసి మూసాపేటలో నివాసముంటోంది. ఆమె కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన రామకృష్ణ (32) అనే తాఫీ మేస్త్రీ ఆమెకు పరిచయమయ్యాడు. 

అయితే పలుమార్లు మహిళను తనతో కలిసి పనులకు తీసుకెళ్లిన అతడికి ఓ దుర్బుద్ది కలిగింది. ఆమె ఒంటిపై వున్న బంగారంపై అతడి కన్ను పడింది. దీంతో ఇటీవల ఆమె కూలీ పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా రామకృష్ణ కలిశాడు. ఇంటి వద్ద దింపుతానని బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దాడి చేసి మెడలో వున్న మంగళసూత్రాన్ని లాక్కున్నాడు. అంతటితో వదిలిపెట్టకుండా ఆమెపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్యాయత్నం చేశాడు.

తీవ్రంగా గాయపడిన మహిళ ఆ రాత్రి ఎలాగోలా ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు తనపై జరిగిన అఘాయిత్యం, హత్యాయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.