తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 275 మందితో రంగారెడ్డి జిల్లా కొత్త రికార్డు.. !
Ranga Reddy District: మహేశ్వరం నియోజకవర్గం నుంచి కె.లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), మంత్రి సబితా ఇంద్రారెడ్డి (బీఆర్‌ఎస్), అందెల శ్రీరాములు యాదవ్ (బీజేపీ) వంటి ప్రముఖులతో పాటు 34 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 275 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు.
Telangana Assembly Elections 2023: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం రాజకీయ వేడిని రగిలించింది. ఇదే క్రమంలో గతంలో లేని సరికొత్త ఎన్నికల రికార్డులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఎన్నికల బరిలో రికార్డు స్థాయిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి నుంచి మొత్తం 275 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేయడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.
వీరిలో 62 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎల్బీనగర్ పోటీకి కేంద్ర బిందువుగా మారి జిల్లాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, జనసేన, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, బీఎస్పీలకు చెందిన అభ్యర్థులు బరిలోకి దిగడంతో అభ్యర్థుల వైవిధ్యం ఈ ప్రాంత రాజకీయ ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. ఎల్బీనగగర్ లో మధు యాష్కీగౌడ్ (కాంగ్రెస్ పార్టీ), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (బీఆర్ఎస్ పార్టీ), సామ రంగారెడ్డి (బీజేపీ) వంటి ప్రముఖులు బరిలోకి దిగారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిస్థితులు గమనిస్తే.. జగదీశ్వర్ గౌడ్ (కాంగ్రెస్), అరికెపూడి గాంధీ (బీఆర్ఎస్), రవికుమార్ యాదవ్ (బీజేపీ) సహా 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్), మంచిరెడ్డి కిషన్ రెడ్డి (బీఆర్ఎస్), దయానంద్ (బీజేపీ) మొత్తం 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో భీమ్ భరత్ (కాంగ్రెస్), కాలె యాదయ్య (బీఆర్ఎస్), రత్నం (బీజేపీ) సహా 19 మంది అభ్యర్థులు ప్రాతినిధ్యం కోసం పోటీ పడుతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీకి ఇటీవలే గుడ్ బై చెప్పిన కసిరెడ్డి నారాయణరెడ్డి (కాంగ్రెస్), జైపాల్ యాదవ్ (బీఆర్ఎస్), తల్లోజు ఆచారి (బీజేపీ) సహా 28 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
షాద్ నగర్ నియోజకవర్గం నుంచి వీర్లపల్లి శంకర్ (కాంగ్రెస్), అంజయ్య యాదవ్ (బీఆర్ఎస్), అందె బాబయ్య (బీజేపీ), విష్ణువర్ధన్ రెడ్డి (ఫార్వర్డ్ బ్లాక్), ప్రశాంత్ (బీఎస్పీ)లు పోటీ పడుతున్నారు. అలాగే, మహేశ్వరం నియోజకవర్గం నుంచి కె.లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), మంత్రి సబితా ఇంద్రారెడ్డి (బీఆర్‌ఎస్), అందెల శ్రీరాములు యాదవ్ (బీజేపీ) వంటి ప్రముఖులతో పాటు 34 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నరేంద్ర (కాంగ్రెస్), ప్రకాశ్ గౌడ్ (బీఆర్ఎస్), తోకల శ్రీనివాస్ రెడ్డి (బీజేపీ) ప్రధాన పోటీదారులుగా ఉండగా, వీరిలో కలిపి మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల హడావుడి తీవ్రతరం కావడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ఆమోదం కోసం వివిధ రాజకీయ వర్గాలకు చెందిన అభ్యర్థులు పోటీ పడుతుండటంతో జిల్లా హోరాహోరీ పోరుకు సిద్ధమవుతోంది.