సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్లిన కాలేజి విద్యార్ధులపైకి ఓ భారీ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కళాశాల విద్యార్థినితో  పాటు నిర్మాణ పనులకోసం వచ్చిన ఓ కార్మికుడు మృతిచెందాడు. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను చూస్తుండగా విద్యార్ధుల బృందంపైకి ఓ వాహనం బ్రేకులు పెయిలై దూసుకెళ్లింది.

ఈ ప్రమాదం కారణంగా ఓ విద్యార్థినితో పాటు ప్రాజెక్టు పనుల కోసం వచ్చిన కార్మికుడు మృతిచెందాడు. మరికొంతమంది విద్యార్థులకు, కార్మికులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారందరిని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలొదిలిన విధ్యార్థిని నాగలక్ష్మి, కార్మికుడు అక్రమ్ ల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యయాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.