హైదరాబాద్:  తెలుగులో సూపర్ డూపర్ హిట్టైన దృశ్యం సినిమాను తలపించేలా ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.హత్యజరిగిన సమయంలో తాను తిరుపతిలో ఉన్నట్టుగా  వీడియోలు సృష్టించాడు.  అయితే టెక్నాలజీ ఆధారంగా ఆ రోజు రాంప్రసాద్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని తేల్చారు.

విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా తెలుగులో విజయవంతమైంది. హత్య చేసిన తర్వాత  పోలీసులకు చిక్కకుండా హీరో వెంకటేష్ పలు జాగ్రత్తలు తీసుకొంటాడు. ఆ మేరకు సాక్ష్యాలను కూడ సృష్టిస్తాడు. ఇదే తరహాలో  వ్యాపార వేత్త రాంప్రసాద్ హత్యకు కూడ కోగంటి సత్యం స్కెచ్ వేశాడు.  కానీ, పోలీసుల ముందు  సత్యం స్కెచ్ వర్కౌవుట్ కాలేదు.

ఈ నెల 6వ తేదీన వ్యాపారవేత్త రాంప్రసాద్‌ను పంజగుట్టలో కిరాయి హంతకులతో కోగంటి సత్యం హత్య చేయించినట్టుగా  పోలీసులు తేల్చారు.  రెండు రోజుల తర్వాత రాంప్రసాద్‌ను తామే హత్య చేశామని శ్యామ్‌తో పాటు మరో ఇద్దరు లొంగిపోయారు. 

రాంప్రసాద్ హత్య జరిగిన మరునాడే కోగంటి సత్యం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. రాంప్రసాద్‌ను  హత్య  చేస్తే తనకు రావాల్సిన డబ్బులు ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. కానీ, ఈ కేసులో  పోలీసులు జరిపిన విచారణలో కోగంటి సత్యం హస్తం ఉందని  పోలీసులు గుర్తించారు.

పంజగుట్టలో రాంప్రసాద్‌ను చంపిన సమయంలో  తిరుపతిలోని ఓ సత్రంలో ఉన్నట్టుగా కోగంటి సత్యం వీడియోలను  సృష్టించాడు. ఈ వీడియోలను కూడ మీడియాకు  అందేలా తన అనుచరుల ద్వారా ప్లాన్ చేశారు. కానీ,కోగంటి సత్యం ఎక్కడ ఉన్నాడో పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలను సేకరించారు.

 రాంప్రసాద్ హత్య జరిగిన సమయంలో  కోగంటి సత్యం పంజగుట్టలోనే ఉన్నట్టుగా  పోలీసులు గుర్తించారు. సత్యం ఉపయోగించిన ఫోన్ ఆధారంగా సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ ద్వారా గుర్తించారు. తిరుపతిలో ఉన్నట్టుగా సత్యం చెబుతోంది వాస్తవం కాదని పోలీసులు తేల్చారు. రాంప్రసాద్, కోగంటి సత్యం మధ్య ఆర్థిక వివాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రూ. కోటి సుపారీ: రాంప్రసాద్‌ను చంపుతుంటే చూడాలని సత్యం ఇలా