రామ్ జెఠ్మలాని అనే పేరు తెలియని రాజకీయ నాయకులు ఉండరు. భారత న్యాయ వ్యవస్థలో రామ్ జెఠ్మలాని పేరు తెలియని వారు ఉండరు. దేశంలోనే పేరెన్నికగన్న న్యాయ కోవిదుడుగా ఆయన సుపరిచితులు. మాజీ కేంద్ర మంత్రిగా రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్న కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పుడు బిజెపితో సంబంధాలు అంతగా లేవు. కేవలం న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతున్నారు. ఆయన కేసు వాదిస్తే ఓటమనేది పెద్దగా ఉండదన్న ప్రచారం కూడా ఉంది.

అటువంటి రామ్ జెఠ్మలానీ తాజాగా తెలంగాణ సిఎం కేసిఆర్ నెలకొల్పబోయే ఫ్రంట్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఎన్డీ టివితో మాట్లాడారు. కేసిఆర్ నెలకొల్పబోయే ఫెడరల్ ఫ్రంట్ కు పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. ఆమె నాయకత్వంలోనే ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెస్, బిజెపిలను ఓడించగలరని స్పష్టం చేశారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ నడగలిగే శక్తి, సామర్థ్యాలు మమతా బెనర్జీకి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు.

మూడో ఫ్రంట్ కోసం తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కేసిఆర్ నాయకత్వం గురించి రామ్ జెఠ్మలాని ఎలాంటి ప్రస్తావన చేయలేదు కానీ.. ఆ ఫ్రంట్ కు మమత నాయకత్వాన్ని ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. మరి రామ్ జెఠ్మలాని కామెంట్స్ ను టిఆర్ఎస్ ఏవిధంగా తీసుకుంటుందో చూడాలి.

(ఎన్డీ టివి న్యూస్ ఐటమ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి : https://www.ndtv.com/india-news/ram-jethmalani-calls-for-mamata-banerjee-led-third-front-to-oust-bjp-1825536)