సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలో అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్ నిర్వహించడమే కాకుండా.. అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న టెకిలా పబ్‌పై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 18 మంది అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని టెకిలా పబ్ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్‌గా స్పందించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్ నిర్వహించడమే కాకుండా.. అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న టెకిలా పబ్‌పై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 18 మంది అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్‌గా స్పందించారు. రాంగోపాల్‌పేట సీఐ సైదులుపై చర్యలు తీసుకున్నారు. సైదులను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనలకు విరుద్దంగా, అర్ధరాత్రి వరకు పబ్బులు తెరిచి ఉంచినా సీఐ సైదులు పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో సీపీ ఈ చర్యలు తీసుకున్నారు. ఇక, రాంగోపాల్ పేట డీఐకి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.
రాంగోపాల్‌పేటలోని Club Tequila Cafe and Barలో అర్ధదాటిన తర్వాత మద్యం సరఫరా చేస్తూ, మహిళలతో అశ్లీలా నత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అర్థరాత్రి దాడి చేశారు. పబ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎనిమిది మంది మహిళలు, ఐదుగురు కస్టమర్‌లతో సహా 18 మందిని అశ్లీలత, ఎక్సైజ్ నియమాల ఉల్లంఘన ఆరోపణలపై అరెస్టు చేశారు.
పోలీసుల ప్రకారం.. పబ్ చట్టవిరుద్ధంగా నిర్వహించడమే కాకుండా ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. పబ్ నిర్వహణ సంబంధిత అధికారుల నుంచి సరైన అనుమతి పొందలేదు. నిబంధనలను పక్కనబెట్టి వినియోగదారులను ఆకర్షించేలా అర్ధరాత్రి దాటినప్పటికీ డీజే సౌండ్‌లు, మహిళల చేత అశ్లీల నృత్యాలు కొనసాగిస్తున్నారు. అర్దరాత్రి దాటిన తర్వాత కూడా కస్టమర్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. మ్యూజిక్ సిస్టమ్ అనుమతించదగిన డెసిబుల్‌లకు మించి ప్లే చేస్తున్నారు.
ఇక, పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో పబ్ ఎండీ ఎండీ నళినీ రెడ్డి, మేనేజర్ ఎన్ రవి, ఇద్దరు డీజేలు బి హరికృష్ణ, సయ్యదా జరీన్, క్యాషియర్ బి ప్రకాష్‌లు ఉన్నారు. వీరితో పాటు 8 మంది మహిళా డ్యాన్సర్లు, ఐదుగురు కస్టమర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
