కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యే  పుట్ట మధు నుండి తనకు ప్రాణహాని ఉందని   బిల్ల రమణారెడ్డి  అనే యువకుడు సోమవారం నాడు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు


హైదరాబాద్: కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు నుండి తనకు ప్రాణహాని ఉందని బిల్ల రమణారెడ్డి అనే యువకుడు సోమవారం నాడు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ఎమ్మెల్యే పాత్రపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీ స్థానిక పోలీసులను ఆదేశించారు.

 తెలంగాణ సాధన కోసం ఆత్మహత్య చేసుకొన్న అమరుడు గుండా నాగరాజు ఆత్మహత్య కేసులో తనను సాక్ష్యం చెప్పకూడదంటూ మంథని ఎమ్మెల్యే తనను బెదిరిస్తున్నాడని రమణారెడ్డి ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేశాడు.

ఎమ్మెల్యే మధు నుండి తనకు ప్రాణ హని ఉందంటూ ఆయన డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో తనను సాక్ష్యం చెప్పొద్దని వేధిస్తున్నాడని బాధితుడు ఆరోపించారు. అయితే ఈ విషయమై ఎమ్మెల్యే పాత్ర ఏ మేరకు ఉందో వాస్తవాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి స్థానిక పోలీసులను ఆదేశించారు.