హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాల భారత్ బంద్ కు తెలంగాణలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి.

నూతన వ్యవసాయచట్టాలను నిరసిస్తూ న్యూఢిల్లీలో 13 రోజులుగా  ఢిల్లీలో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ కు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు బస్ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. లారీ యజమానులు కూడ ఈ బంద్ లో పాల్గొన్నాయి.హయత్‌నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించాయి. దీంతో హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

నల్గొండ జిల్లాలోని భువనగిరిలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  తెరిచి ఉన్న బేకరీ షాపుపై సీపీఎం కార్యకర్తలు దాడికి దిగారు.నార్కట్ పల్లి-అద్దంకి రహదారిపై వామపక్షాలు ఆందోళనకు దిగాయి. భారత్ బంద్ కు మద్దతుగా హైద్రాబాద్ లో ఐటీ ఉద్యోగులు కూడ నిరసనకు దిగారు. 

మాదాపూర్- రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద  ఐటీ ఉద్యోగులు  ప్ల కార్డులు పట్టుకొని నిరసనకు దిగారు.సింగరేణి కార్మికులు కూడ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వ్యాపారులు కూడ దుకాణాలు మూసివేసి బంద్ కు మద్దతు ప్రకటించారు. హైద్రాబాద్ లో 15 నిమిషాల పాటు  మెట్రో రైల్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు నిలిపివేశారు.  పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను మెట్రో స్టేషన్ నుండి బయటకు పంపారు.

హైద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. షాద్ నగర్ వద్ద బెంగుళూరు -హైద్రాబాద్ జాతీయ రహదారిపై , సిద్దిపేట వద్ద కరీంనగర్ రహదారిపై  మంత్రి హరీష్ రావు  రాస్తారోకో నిర్వహించనున్నారు.మంగళవారం నాడు ఉదయం నుండే పలు రాజకీయ పార్టీలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.
పలు రహాదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్లను బ్లాక్ చేశారు.