Rajya Sabha Election 2022: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు లభించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
Rajya Sabha Election 2022: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అధికార బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో బీజేపీ భాజపా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు ఇచ్చింది. ఆయనను ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు బరిలోకి దింపాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. నామినేషన్లకు చివరి రోజు నేడే కావడం గమనార్హం.
సోమవారం రాత్రి బీజేపీ అధిష్టానం ఆకస్మికంగా నలుగురు అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. ఇందులో కర్ణాటక నుంచి లహర్ సింగ్ సిరోయా, మధ్యప్రదేశ్ నుంచి సుమృతా వాల్మీకి, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మిథిలేష్ కుమార్, డాక్టర్ కె.లక్ష్మణ్ లకు అవకాశం కల్పించారు.
అయితే.. వచ్చే ఏడాది జరుగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. కే. లక్ష్మణకు గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బీజేపీ ముషీరాబాద్ నుండి బరిలో దించింది. కానీ.. పోటీచేసి ఓడిపోయారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా.. బండి సంజయ్ ను ఎన్నుకున్న తరువాత .. అధిష్టానం ఆయనను జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా నియమించింది.
తాజాగా.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్య సభకు పంపి.. తెలంగాణ కూడా సముచిత ప్రాధ్యానత్య ఇస్తున్నమని బీజేపీ ప్రరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణ నుంచి లోక్ సభలో బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావులు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. రాజ్యసభలో బీజేపీ తరుపున రాష్ట్ర విషయాలను ప్రస్తవించేవారు కరవయ్యారు. ఆ లోటును ఇలా భర్తీచేయనున్నారు. దీంతో పాటు.. తెలంగాణలోని బలమైన మున్నూరుకాపు, ఓబీసీ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకొనేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేసినందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇదివరకు.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇప్పుడు లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. రాష్ట్రం నుంచి బీజేపీ తరుపున రాజ్యసభకు ఎన్నిక కాబోతున్న తొలి వ్యక్తి కే. లక్ష్మణే..
1960 జులై 3న జన్మించిన ఈయన స్వస్థలం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, జియాలజీలో పీహెచ్‌డీ. తొలుత విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పనిచేసిన ఆయన.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. లక్ష్మణ్ 1999లో, 2014లో ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2020 దాకా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా పని చేశారు.
