హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం టీఆర్ఎస్ సర్కార్ అడుగులు వేస్తోందనే సంకేతాలు కన్పిస్తున్నాయి. గురువారం నాడు  ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆశోక్‌ లావాసాతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  రాజీవ్ శర్మ సమావేశమయ్యారు.

బుధవారం నాడు సాయంత్రం సుమారు  ఐదు గంటలకు పైగా  తెలంగాణ సీఎం కేసీఆర్  మంత్రులతో   హైద్రాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల విషయమై చర్చించారు. 

అయితే ముందస్తు ఎన్నికల  నిర్వహణకు సంబంధించి పలువురు మంత్రుల అభిప్రాయాలను సేకరించారు. అయితే మంత్రుల సమావేశంలో  ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ గురువారం నాడు  మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆశోక్ లావాసాతో సమావేశమయ్యారు. గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ కూడ ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

అయితే కేంద్ర సర్వీసుల్లో  సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో  తాను  ఎన్నికల కమిషనర్ ను కలిసినట్టు రాజీవ్ శర్మ మీడియాకు చెప్పారు. అయితే  తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కోరుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి  ఢిల్లీలో మీడియాకు చెప్పారు. 

ఇదిలా ఉంటే  తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహాన్ తో సమావేశమయ్యారు.గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఢిల్లీ, హైద్రాబాద్‌లో చోటు చేసుకొన్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో వేడిని పుట్టించాయి. ముందస్తు ఎన్నికలకు సంబంధించిన విషయంపై  రాజీవ్ శర్మ  ఆరా తీసినట్టు సమాచారం. 

ముందస్తు ఎన్నికల విషయంలో  విపక్షాలను బురిడీ కొట్టించేలా  టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కన్పిస్తోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే టీఆర్ఎస్ చీఫ్  ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకొంటారనే దానిపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.