హైదరాబాద్: రజిత హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లి రజితను కూతురు కీర్తి తన ప్రియుడు శశికుమార్ తో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. మద్యం తాగించి, రజిత హత్యకు శశికుమార్ కీర్తిని రెచ్చగొట్టినట్లు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

తన తల్లి రజితను తాను, శశి కలిసి హత్య చేసినట్లు కీర్తి పోలీసు విచారణలో అంగీకరించింది. కీర్తితో పాటు శశిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19వ  తేదీన కీర్తి తల్లి రజిత కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్ కు వెళ్లింది. ఆ సమయంలో శశి వాళ్లింటికి వచ్చాడు. 

Also Read: ఒకరికి బ్రేకప్, మరొకతనితో లవ్: అమ్మను చంపి దొరికాక ఏడ్చేసిన కీర్తి

రజిత తిరిగి వచ్చేసరికి శశితో కీర్తి ఉంది. దాన్ని గమనించిన రజిత వాళ్లిద్దరినీ మందలించింది. దాంతో రజితను చంపేస్తేనే తాము కలిసి ఉండవచ్చునని శశి కీర్తికి నూరిపోశాడు. రజిత మందలించడంతో బయటకు వెళ్లిన శశి బీరు బాటిల్స్ తో కీర్తి ఇంటికి వచ్చాడు. కీర్తి తల్లి లోపలి గదిలో ఉండగా ఇంటి ఆవరణలోనే కీర్తితో శశి బీరు తాగించాడు. 

మద్యం మత్తులో ఉన్న కీర్తిని శశి హత్యకు ప్రేరేపించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్లారు. తల్లి అరవకుండా కీర్తి ఆమె ముఖంపై దిండు పెట్టి నొక్కగా, శశి చున్నీతో రజిత గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది.  

Also Read: లవ్ అఫైర్, తల్లిని చంపిన కీర్తి ఈమెనే: తండ్రి ఏమన్నారంటే

ఆ తర్వాత మూడు రోజుల పాటు శవాన్ని అక్కడే పెట్టుకుని గడిపారు. దుర్వాసన వస్తుండడంతో రజిత శవాన్ని కారులో తీసుకుని వెళ్లి రామన్నపేట దగ్గరలో రైలు పట్టాలపై పడేశారు. కీర్తి ఇంట్లోంచి మూడు బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read: ఇద్దరితో లవ్: తల్లిని చంపి శవం పక్కనే మూడు రోజులు ప్రియుడితో.