హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో భారీ వర్షంతో ఒలంపిక్ మెడలిస్ట్, షూటర్ గగన్ నారంగ్ అకాడమీలో భారీగా వర్షం నీరు చేరింది.  సుమారు 1.3 కోట్ల విలువైన షూటింగ్ సామాగ్రి పాడైందని నారంగ్ ప్రకటించారు.

సికింద్రాబాద్ తిరుమలగిరిలో గగన్ నారంగ్ గన్ ఫర్ గ్లోరీ అకాడమీ ఉంది. ఈ అకాడమీలోకి వర్షం నీరు చేరింది. దీంతో 1.3 కోట్ల విలువైన సామాగ్రి పూర్తిగా నీటిలో మునిగి పాడైందని ఆయన వివరించారు.

గతంలో ఉన్న సామాగ్రితో పాటు కొత్తగా తెచ్చిన 80 రైఫిల్స్, పిస్టల్స్ ఇతర సామాగ్రి నీటిలో మునిగిపోయాయని ఆయన చెప్పారు.ఈ అకాడమీని డెవలప్ చేసేందుకు ఎంతో కష్టపడ్డామన్నారు. అయితే వర్షం దెబ్బకు తన అకాడమీ పనికిరాకుండాపోయిందన్నారు. 

 

ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. తన అకాడమీలో నెలకొన్న పరిస్థితిని ఫోటోలు తీసి ట్విట్టర్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు షేర్ చేశాడు గగన్ నారంగ్.

హైద్రాబాద్ నగరంలో భారీ వర్షపాతం కురిసింది. మంగళవారంనాడు రాత్రి హైద్రాబాద్ లో సుమారు 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగర శివారులోని హయత్ నగర్, ఘట్‌కేశర్ లలో 32 సెం.మీ వర్షపాతం కురిసినట్టుగా వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.ఈ వర్షంతో నగరంలోని పలు కాలనీల్లో వరద నీరు ఇంకా అలానే ఉంది. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.