ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతోన్న జనానికి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురుస్తుందని తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా మీదుగా ఉత్తర కర్నాటక వరకు 800 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఈ రెండింటి ప్రభావం కారణంగా తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 26న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తాలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వాయుగుండం తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశముందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.