తెలంగాణలో ఈ ఏడాది వేసవి ప్రారంభానికి ముందు నుంచే ఎండలు దంచికొడుతున్న సంగతి  తెలిసిందే. మార్చి నెలలోనే పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందించింది. 

హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది వేసవి ప్రారంభానికి ముందు నుంచే ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. మార్చి నెలలోనే పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండ తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందించింది. తెలంగాణలో బుధ, గురు, శుక్రవారాల్లో మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసిన జిల్లాల జాబితాలో.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి.

చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించి ఉందని.. దీనికి తోడు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఫలితంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక, ఉరుములతో కూడిన జల్లుల సమయంలో పిడుగులు పడతాయని.. పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. 

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో బుధ, గురువారాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గత కొంతకాలంగా ఎండలతో సతమవుతున్న నగరవాసులకు ఉష్ణోగ్రతల తగ్గుదల కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది.