సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ మహిళా ఉద్యోగి దారుణంగా ప్రవర్తించింది. వయసులో పెద్దవాడు అని కూడా చూడకుండా వృద్ధుడిని కించపరిచింది. చెప్పుతో కొట్టింది. కాగా.... బాధితుడు ఈ విషయాన్ని రైల్వే ఉద్యోగుల దృష్టికి తీసుకువెళ్లాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్‌ జిల్లా మాలపల్లికి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌ ఈనెల 24న నగరానికి వచ్చి ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి వెళ్లేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు.
 
జనరల్‌ బుకింగ్‌ కౌంటర్‌ వద్ద సీనియర్‌ సిటిజన్‌కు సంబంధించిన టికెట్‌ కావాలని విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని కోరాడు. ఆమె కోపంతో వృద్ధుడితో టికెట్‌ విషయంలో గొడవ పడింది. మాటమాటా పెరిగి కౌంటర్‌ నుంచే వృద్ధుడిపై చేయి చేసుకొంది. 

ఆపై బయటకొచ్చిన మహిళా ఉద్యోగిని ఆగ్రహంతో వృద్ధుడిని చెప్పుతో కొట్టింది. ఈలోగా నిజామాబాద్‌ వెళ్లే రైలు రాగానే అందులో వెళ్లిపోయిన వృద్ధుడు తిరిగి తన స్నేహితులతో కలిసొచ్చి ఈనెల 29న సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.