ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం: దగ్ధమైన బోగీలను పరిశీలించిన క్లూస్ టీమ్
ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై రైల్వే శాఖ విచారణ బృందం విచారణ చేస్తుంది. రెండు రోజుల క్రితం భువనగిరికి సమీపంలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది.
హైదరాబాద్: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదంపై రైల్వే శాఖ నియమించిన ఉన్నతాధికారుల కమిటీ ఆదివారంనాడు విచారణను ప్రారంభించింది. న్యూఢిల్లీ నుండి వచ్చిన రైల్వే శాఖ డీఐజీ సునీల్ నేతృత్వంలోని బృందం ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై విచారణను ప్రారంభించారు. డీఐజీ సునీల్ నేతృత్వంలోని బృందంలో 16 విభాగాలకు చెందిన సుమారు 40 మందికిపైగా అధికారులున్నారు.
అగ్ని ప్రమాదం కారణంగా దెబ్బతిన్న రైల్వే బోగీలను బీబీనగర్ వద్ద రైల్వే శాఖ ఉన్నతాధికారుల కమిటీ పరిశీలించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎప్పుడు చైన్ లాగారు, అలారం ఎప్పుడు మోగిందనే విషయమై విచారణ కమిటీ ఆరా తీసింది. రైలులో ఎవరైనా అగ్ని ప్రమాద కారకమైన పదార్ధాలను రవాణా చేశారా అనే విషయమై కూడ ఈ బృందం ఆరా తీసింది. దగ్దమైన బోగీల్లో ఆధారాల కోసం క్లూస్ టీమ్ పరిశీలించింది.
also read:ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం: దగ్ధమైన బోగీలు బీబీనగర్ కు తరలింపు
దగ్ధమైన రైల్వే బోగీల్లో మంటలకు ఆహుతైన ఆభరణాలు, వస్తువులను క్లూస్ టీమ్ గుర్తించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విచారణ బృందం ప్రజలను కోరింది.
ఈ నెల 7వ తేదీన హౌరా నుండి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో పగిడిపల్లి- బొమ్మాయిపల్లి మధ్య అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో బోగీ పాక్షికంగా దగ్దమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కూడ పరిశీలించారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టుగా జీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.