న్యూఢిల్లీ: కాంగ్రెసు, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఏర్పాటు చేయతలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ పై కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరా తీశారు. కేసీఆర్ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీని, మాజీ ప్రధాని దేవెగౌడను, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డిఎంకె నేత స్టాలిన్ లను కలిశారు. హేమంత్ సొరేన్ తో కూడా భేటీ అయ్యారు. 

మరోవైపు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ హైదరాబాదు వచ్చి బుధవారంనాడు కేసిఆర్ ను కలుస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నారు.  కాంగ్రెసుకు అనుకూలమైన నేతలను కేసిఆర్ కూడబట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఫెడరల్ ఫ్రంట్ పై ఆరా తీశారు.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనక గల నేపథ్యాన్ని, దాని ఉద్దేశాన్ని సీనియర్ కాంగ్రెసు నేత వి. హనుమంతరావు రాహుల్ గాంధీకి వివరించారు. మంగళవారంనాడు విహెచ్ రాహుల్ గాంధీని కలిశారు. 

కుటుంబంలోని, పార్టీలోని అంతర్గత విభేదాలు బయటపడకుండా ఉండడానికి కేసిఆర్ ఫ్రంట్ ను ముందుకు తెచ్చారని తాను రాహుల్ గాంధీకి చెప్పినట్లు విహెచ్ మీడియాతో చెప్పారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని భార్య, కోడలు నుంచి కెసిఆర్ పై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. 

కెటిఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే సంభవించే పరిణామాలు, పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బయటపడకుండా జాగ్రత్త పడేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు .