తెలంగాణ జెఎసి ఛైర్మన్ పదవికి ప్రొఫెసర్ కోదండరాం రాజీనామా చేశారు. 2010 నుంచి ఆయన జెఎసి కి సారధిగా పనిచేస్తున్నారు. 8 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం ఆయన జెఎసిని నడిపారు. తెలంగాణ జన సమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీని కోదండరాం స్థాపించారు. దీంతో రేపు జరగనున్న జన సమితి ఆవిర్భావ సభలో కోదండరాం కొత్త రాజకీయ పార్టీకి అధ్యక్షులు కానున్నారు. దీంతో జోడు పదవులు వద్దనుకున్న కోదండరాం శనివారం సాయంత్రమే గన్ పార్కు వద్దకు వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం జెఎసి కన్వీనర్ గా ఉన్న రఘు కు కోదండరాం తన రాజీనామా లేఖను అందజేశారు. ఇకనుంచి తన బాధ్యతలన్నీ కన్వీనర్ రఘు చూసుకుంటారని కోదండరాం ప్రకటించారు. జెఎసికి కొత్త ఛైర్మన్ ఎన్నికయ్యే వరకు రఘు బాధ్యతలు చేపడతారు. భవిష్యత్తులో జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశమై కొత్త ఛైర్మన్ ను నియమించుకుంటుందన్నారు.

ఉద్యమ సమయంలో  కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టానని, దాదాపు 8 ఏళ్లపాటు సుదీర్ఘ కాలం జెఎసి సారధ్య బాధ్యతల్లో ఉన్నట్లు కోదండరాం గుర్తు చేసుకున్నారు. 2010 నుండి ఇప్పటి వరకు ఉన్నాను. తెలంగాణ జన సమితి పార్టీలో క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయించుకున్నాను అని కోదండరాం వెల్లడించారు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు కోదండరాం. జేఏసీ లో తాను లేక పోయినా తమ పార్టీ  సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. తరువాత జెఎసి చైర్మన్ ఎవరేనేది స్టీరింగ్ కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.