యుద్ధం షురూ: పవన్ కల్యాణ్ కు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే లీగల్ నోటీసులు

Radhakrishna serves notice to Pawan Kalyan
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు మధ్య వివాదం ముదురుతోంది. 

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు మధ్య వివాదం ముదురుతోంది. పవన్ కల్యాణ్ తన పరువుప్రతిష్టలకు భగం కలిగించే విధంగా ట్విట్టర్ లో అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారని, పవన్ కల్యాణ్ పై పరువు నష్టం దావా వేస్తానని రాధాకృష్ణ హెచ్చరించారు. 

ఆ మేరకు న్యాయవాది ద్వారా పవన్ కల్యాణ్ కు లీగల్ నోటీసులు పంపించారు. తనపైనా, తన సంస్థపైనా చేసిన ఊహాజనిత, నిరాధారమైన ఆరోపణలు, ట్వీట్లను బేషరతుగా తొలగించి  బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

లేనిపక్షంలో తాను తీసుకోబోయే సివిల్, క్రిమినల్ చర్యలను ఎదుర్కోవడానికి పవన్ కల్యాణ్ తో పాటు ఆయన వెనక ఉన్నవారు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తన వ్యక్తిగత, రాజకీయాలను కప్పిపుచ్చుకునేందుకు పవన్ కల్యాణ్ కావాలని, ఉద్దేశపూర్వకంగా చేసిన ఆ ట్వీట్లలో వీసమెత్తయినా వాస్తవం లేదని ఆర్కే అన్నారు.

ఆంధ్రజ్యోతి - ఎబిఎన్ వార్తాసంస్థలు నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి  పనిచేస్తాయని ఆయన గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ఆరోపించినట్లు పీఆర్పీ కోసం మహిళలను దూషించే అలవాటు ఆ సంస్థలకు లేదని ఆయన స్పష్టం చేశారు. 

సమాజానికి మీడియా చేసే మేలును తగ్గించి చూపడం రాజకీయ నేతలకు అలవాటైన పనేనని అన్నారు. అయితే లైంగిక ఆసమానతపై ఆంధ్రజ్యోతి - ఏబిఎన్ చేసిన పోరు గురించి మరిచిపోవడం పవన్ కు తగదని అన్నారు. పవన్ ఆరోపిస్తున్నట్లు తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు గానీ, ఏ పార్టీ వైపు మొగ్గు గానీ లేదని స్పష్టం చేశారు. 

పవన్ కల్యామ్ ట్విట్టర్ లో అనుచిత యుద్ధం ప్రకటించారని, పవన్ కొద్ది రోజులుగా వరుస ట్వీట్లతో తన అభిమానుల్లో అసహనం పెంచారని, దీంతో పవన్ మద్దతుదారులు,స అభిమానులు ఆంధ్రజ్యోతి - ఏబిఎన్ రిపోర్టర్లపై దాడి చేసి గాయపరిచారని, ఓబీ వ్యాన్ ను ధ్వంసం చేశారని అన్నారు. 

పడిపోతున్న రాజకీయ ప్రతిష్టను పునరుద్ధరించుకోవడానికే పవన్ తనపై ఊహాజనిత, వండివార్చిన ట్వీట్లను పోస్టు చేసారని విమర్శించారు. నేరపూరిత కుట్రలో భాగంగానే పవన్, మరికొందరితో కలిసి ఈ ట్వీట్లను చేస్తున్నారని తాను విశ్వసిస్తున్నట్లు రాధాకృష్ణ తెలిపారు. 

loader