పలానా దాంట్లో మీరు భారీ క్యాష్ ఆఫర్, లేదా విలువైన బహుమతి గెలుచుకున్నారంటూ ఫోన్ కాల్స్ వస్తే వెంటనే స్పందించకండి. ఎందుకంటే మీరు మోసపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సైబ్రర్ క్రైమ్ నేరగాళ్లు.. ఆఫర్లు, బొనాంజాల పేరిట వినియోగదారులకు వల వేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని రచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

టీవల ఈ తరహ మోసాలు పెరుగుతుండడం చాలా మందిని బాధితులుగా మారుస్తుంది. ఖరీదైన బహుమతులు అనగానే చాలా మంది బాధితులు ముందు వెనకా ఆలోచించకుండానే లక్షలు డిపాజిట్ చేస్తున్నారు. ఆ తర్వాత లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తుండడంతో సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదులు నమోదు పెరుగుతున్నాయి. 

ఈ ఫిర్యాదులపై విశ్లేషించిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఆశతోనే అమాయకులు వారిని నమ్ముతు నగదును పోగట్టుకుంటున్నారని తేలింది. ఇంత డబ్బు ఎందుకు వేశారని ప్రశ్నించగానే అమాయక సమాధానాలు పోలీసు అధికారులను విస్మయానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వ్యాపారులు వీటి బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. సైబర్ ఛీటర్‌లు అమాయకులను నమ్మించేందుకు ఏకంగా ఆర్‌బీఐ గవర్నర్ సంతకంతో జారీ చేసిన ఓ లేఖ ను సైతం వాట్సాప్‌లో పంపిస్తున్నారు. అదే విధంగా వారిపై అనుమానం రాకుండా ఉండేందుకు ఏకంగా ఆధార్ కార్డులను పంపుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో ప్రైవేటు బ్యాంకులకు చెందిన లేఖలను సైతం వాట్సాప్‌లలో పంపిస్తూ అమాయకులను ఆశలో ముంచేస్తున్నారు. 

హిందిలో అనర్గళంగా మాట్లాడి నిజంగానే బహుమతి చేజారిపోతుందనే భావనను తీసుకువచ్చి నగదు డిపాజిట్ చేయించుకుంటారు. ఒక సారి నగదు డిపాజిట్ అయినా తర్వాత సైబర్ ఛీటర్‌ల ఫోన్ నెంబర్లు పని చేయవు. అమాయకులను బురిడి కొట్టించేందుకు మీకు టాటా సఫారీ కావాలా లేద నగదు కావాలా ఎంచుకోమని వల వేస్తారు. కాబట్టి ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.