ఏదైనా రాత్రి 8 కి క్లోజ్ చేయాల్సిందే.. అత్యవసరమైతేనే బయటకు రండి: సీపీ మహేశ్ భగవత్
కరోనా సెకండ్ వేవ్ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతోందన్నారు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్. తెలంగాణ ప్రభుత్వం వైరస్ కట్టడికి నైట్ కర్ఫ్యూ విధించడంతో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు
కరోనా సెకండ్ వేవ్ చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతోందన్నారు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్. తెలంగాణ ప్రభుత్వం వైరస్ కట్టడికి నైట్ కర్ఫ్యూ విధించడంతో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు మాస్క్‌తో పాటు సామాజిక దూరం పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
థియేటర్లు, షాపులు, వైన్స్ రాత్రి 8 గంటల కల్లా మూసివేయాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మహేశ్ భగవత్ హెచ్చరించారు. అత్యవసరం వుంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సీపీ స్పష్టం చేశారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 20 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.
మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, ఐటీ, ఈ కామర్స్ వస్తువుల పంపిణీ, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లకు కూడా మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా విభాగాలు, వాటర్ సప్లై, శానిటేషన్, కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌజేస్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ లకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభించింది.
Also Read:తెలంగాణలో నైట్ కర్ఫ్యూ: మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్పు
గర్భిణీలు, రోగులు మెడికల్ సేవలు పొందవచ్చు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాల నుండి ఇళ్లకు వెళ్లేవారంతా టికెట్లను చూపాలని ప్రభుత్వం ప్రకటించింది.నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మెడికల్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తమ వెంట గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది.
అంతరాష్ట్ర, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు నిత్యావసర, అత్యవసర , ఇతర సరుకుల రవాణా కోసం ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల తర్వాత ప్రజా రవాణా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.