హైదరాబాద్: తెలంగాణ శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలుగుదేశం పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.  తన విషయంలో కూడా చంద్రబాబు సరిగా వ్యవహరించలేదనే ఆభిప్రాయంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.

తాను గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఓ ఉద్యోగ సంఘానికి ఎపిలో అధికారిక గుర్తింపు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించడం ఆయన మనస్తాపానికి గురి చేసినట్లు తెలుస్తోంది. పైగా ఆ పదవి నుంచి ఆర్. కృష్ణయ్య పేరు తొలగిస్తేనే గుర్తింపు ఇస్తామని మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్. కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తానని గత ఎన్నికల సమయంలో ప్రకటించారు. ఆ తర్వాత ఆయనను పూర్తిగా విస్మరించారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన చెప్పిన చంద్రబాబు శాసనసభా పక్ష నేత పదవి ఇవ్వలేదు. అప్పటి నుంచి కూడా కృష్ణయ్య దాదాపుగా తెలుగుదేశంతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. 

న్యాయమూర్తులుగా ఎంపికైన బీసీ న్యాయవాదులు పనికిరారని చంద్రబాబు ఓ నివేదిక ఇవ్వడం కూడా కృష్ణయ్య అసంతృప్తికి కారణమని అంటున్నారు. పైగా దానిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని అంటున్నారు.