ఆ 200 ల ముచ్చటేంది కేసిఆర్ : ఆర్ కృష్ణయ్య ఫైర్

R Krishnaiah criticises KCR's BC policy
Highlights

గరం గరం..

ఆ 200 ల ముచ్చటేంది కేసిఆర్ : ఆర్ కృష్ణయ్య ఫైర్

తెలంగాణ సిఎం కేసిఆర్ మీద ఫైర్ అయ్యారు బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. టిడిఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే చదవండి.

గత డిసెంబర్ నెలలో కేసిఆర్ ఆర్భాటంగా బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు 200 తీర్మానాలు ప్రతిపాదించారు. ఐదు నెలల గడుస్తున్నా ఆ 200 తీర్మానాలకు అతీ గతీ లేదు. ఆ తీర్మానాల అమలుపై కేసీఆర్ స్పందించాలి. తక్షణమే తెలంగాణలో 500 బీసీ రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఇంకో నెలలో స్కూళ్ళు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు బోధన అధ్యాపకులు లేరు,మౌలిక సదుపాయాలు లేవు.

100 బీసీ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలి. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 52 శాతం బీసీ జనాభా ఉంది. బీసీ రుణాల విషయంలో దరఖాస్తు చేసుకున్న అందరికి రుణాలు తప్పకుండా ఇవ్వాల్సిందే. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ అర్హులే కాబట్టి వారందరికీ రుణాలు ఇవ్వాలి. తెల్ల రేషన్ కార్డ్ ఉన్నా,2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. పేదలకు రుణాలు ఇవ్వకపోతే బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. బ్యాంకుల్లో అవినీతి బాగా పెరిగిపోయింది.

బీసీ లకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదు. బీసీల్లో ఉన్న పేద విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్ మెంట్ ఇచ్చిన మిగతా ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలి. బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేయాలి. చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఈ విషయంలో కేంద్రంపై వత్తిడి పెంచాలి.

loader