హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీపై నిర్మించిన పురానాపూల్ వంతెన దెబ్బతింది.

400 ఏళ్ల క్రితం మూసీ నదిపై నిర్మించిన పురానాపూల్ బ్రిడ్జి పిల్లర్ పై పగుళ్లు ఏర్పడ్డాయి. అంతేకాదు బ్రిడ్జి కొంత మేర కుంగిపోయింది. దీంతో అధికారులు ఈ బ్రిడ్జిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు.

బ్రిడ్జి పటుత్వాన్ని పరిశీలించిన తర్వాత వాహనాల రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

also read:వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ. 10 వేలు: కేసీఆర్

నగరంలో కుతుబ్‌షాహీలు నిర్మించిన  కట్టడాల్లో పురానాపూల్ బ్రిడ్జి కూడ ఒకటి. గోల్కోండ కోట నుండి కార్వాన్ వెళ్లేందుకు గాను 1578 లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా దీనిని నిర్మించారు. 

1820లో మూసీకి వచ్చిన వరదలకు ఈ బ్రిడ్జి దెబ్బతింది. దీంతో అప్పటి నవాబ్ సికిందర్ షా మరమ్మత్తులు చేయించాడు.ఆ తర్వాత 1908 మూసీ వరదల తర్వాత కొద్ది బాగాన్ని మరమత్తు చేశారు.  మరో వందేళ్ల తర్వాత మూసీకి మరోసారి బారీ వరదలు రావడంతో మరోసారి బ్రిడ్జి కుంగిపోయింది.