Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టం సూపరుంది

  • పంజాబ్ లో ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నాం
  • అందరూ ప్రయివేటు స్కూల్స్ వైపు మొగ్గుతున్నారు
  • పంజాబ్ లో 23 ప్రయివేటు యూనివర్శిటీలు నెలకొల్పినం
punjab education minister all prize for telangana education

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ విధానాన్ని అధ్యయనం చేయడానికి పంజాబ్ నుంచి ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి చరణ్ జీత్ సింగ్ నేతృత్వంలో అధికారుల బృందం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని సచివాలయంలో గురువారం కలిసింది. పంజాబ్ లో ప్రైవేట్ విద్యా సంస్థలపై పటిష్టమైన నియంత్రణ విధానాన్ని అమలుచేయడంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ప్రైవేట్ విద్యా సంస్థల నియంత్రణ విధానాన్ని అధ్యయనం చేస్తున్నట్లు పంజాబ్ మంత్రి చరణ్ జీత్ సింగ్ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వివరించారు. తెలంగాణలో విద్యావిధానం బాగుందని, ఇక్కడి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుందని తెలుసుకుని, ఇక్కడ అమలు చేస్తున్న విధానాలు అధ్యయనం చేయడానికి వచ్చామన్నారు. తమ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎనిమిది విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ రంగంలో 23 యూనివర్శిటీలున్నాయన్నారు. ప్రైవేట్ రంగంలోని యూనివర్శిటీలు పూర్తిగా స్వయంప్రతిపత్తితో నడుస్తున్నాయని, అక్కడ ఎలాంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. అయితే విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి చాలామంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని, దీంతో తమ రాష్ట్రంలో 20 శాతం పాఠశాలలను మూసివేశామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలపై గతంలో సరైన నియంత్రణ లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియంత్రణ పకడ్బందీ చేశామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పక్కాగా ఉండడానికి బయో మెట్రిక్ మెషీన్లు పెట్టామన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యలో పరీక్షలు రాయాలంటే విద్యార్థులకు కచ్చితంగా 75 శాతం హాజరు శాతం ఉండాలనే నిబంధన పెట్టామని చెప్పారు. అదేవిధంగా మొదటి సంవత్సరంలో కనీసం 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణత పొందితేనే రెండో సంవత్సరానికి అనుమతినిస్తున్నామన్నారు. ఆన్ లైన్ అడ్మిషన్లు చేపడుతున్నామని, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ర్యాంక్ సాధించిన వారికే సీట్లు ఇస్తున్నామని చెప్పారు. విద్యార్థుల బోగస్ నమోదును నివారించేందుకు ఆధార్ లింక్ అడ్మిషన్లు చేస్తున్నామన్నారు.

ఫీజులను నియంత్రించేందుకు రిటైర్డ్ జడ్జీ అధ్యక్షుడిగా ఫీజు నియంత్రణ కమిటీ ఉందని, వారే ఆయా కాలేజీల ప్రమాణాలు, మౌలిక వసతులను బట్టి ఫీజులను నిర్ధారిస్తారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వివరించారు. ఇంజనీరింగ్ కాలేజీలకు గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నామని, ఈ గ్రేడింగ్ ప్రకారమే ఫీజుల నిర్ధారణ ఉంటుందన్నారు.

ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు. దీనివల్ల గతంలో 412 ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ఇప్పుడు 212కు చేరిందన్నారు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య కూడా రెండున్నర లక్షల నుంచి 97వేలకు చేరిందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల సీరియస్ విద్యార్థులు మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్నారని వివరించారు. ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి వివిధ జాతీయ స్థాయి సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా అడ్మిషన్లు పొందే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందన్నారు.

మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, ప్రైవేట్ విద్యాసంస్థలను పటిష్టంగా నియంత్రణ చేస్తున్నామని చెప్పారు.

 ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసిన పంజాబ్ బృందంలో ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి. వజ్రలింగం, ఎస్.కె సందు, కార్యదర్శి వికాస్ ప్రతాప్ ఉన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసి రామచంద్రం, జేఎన్టీయు వీసీ గోపాల్ రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వీసీ వేణుగోపాల్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పంజాబ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి చరణ్ జీత్ సింగ్ ను శాలువాతో సత్కరించి మెమెంటో అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios