తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జ్ఞాన సరస్వతీ మాత ఆలయంలోకి కత్తులు, బ్లేడ్లతో ప్రవేశించడానికి ప్రయత్నించిన ఓ సైకోను సెక్యూరిటి సిబ్బంది పట్టుకున్నారు. అయితే ఇదే యువకుడు గతంలో రెండుసార్లు ఇలాగే గర్భాలయంలో ఆత్మహత్యాయత్నం చేసినట్లు గుర్తించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది యువకున్ని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన దీపావళి రోజే జరిగినా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నివాసి సిలివేరు ప్రసాద్ గౌడ్ బుధవారం తెల్లవారుజామున కత్తులు, బ్లేడ్లతో  బాసర ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఇతడు ముసుగు ధరించి అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద వుండే సెక్యూరిటీ సిబ్బంది ఆపి తనిఖీ చేశారు. అతడి వద్ద బ్లేడ్లు, కత్తులు బైటపడ్డాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ప్రసాద్ గౌడ్ ను పోలీసులకు అప్పగించారు.

ఈ యువకుడు గతంలో కూడా సైకోలా వ్యవహరిస్తూ బాసర ఆలయంలో కత్తులతో వీరంగం సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా గతంలో ఏకంగా గర్భాలయంలోకి ప్రవేశించి ఆత్మహత్యకు ప్రయత్నించాడని...అందుకు అడ్డుకున్న పూజారిని కూడా గాయపర్చినట్లు తెలిపారు. 

అయితే అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా తన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలిపాడు. గర్భగుడిలో ప్రాణాలు వదిలితే నేరుగా స్వర్గానికి వెళతారని ఎవరో చెబితే ఇలా చేశానని తెలిపాడు. అదీ దీపావళి రోజున అయితే మరింత ఫలితం ఉంటుందని చెప్పడంతో ఆత్మహత్యాయత్నం చేశానని పోలీసులకు తెలిపాడు.

 ప్రసాద్ గైడ్ మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే మళ్లీ అతడు సరిగ్గా దీపావళి రోజునే ఇలా కత్తులతో ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది.