అతని టార్గెట్ కేవలం  ప్రేమికులే. ఏకాంతంగా ఉన్న వారిపై దాడి చేసి... ప్రియుడ్ని హత్య చేస్తాడు. అనంతరం యువతిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన ఈ సైకో కిల్లర్ రాజు అలియాస్ అంకమరాజు(35) ఇప్పుడు ఖమ్మం జిల్లా మధిర పట్టణ పోలీసులకు చిక్కినట్లు సమాచారం.

ప్రేమికులపై దాడి చేసి.. వారిని హత్య చేసి యువతులపై అత్యాచారాలకు పాల్పడుతుంటాడనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొద్దిరోజుల క్రితం ఇతన్ని అరెస్టు చేశారు. అయితే... ఈ హంతకుడే గతంలో మధిర మండలం తొర్లపాడు సమీపంలోని సుబాబుల్ తోటలో గతంలో ఒక వ్యక్తిని హత్య చేసి రైల్వే ట్రాక్ పై పడేసి వెళ్లాడు. ఈ విషయంపై రైల్వే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నూజివీడులో జరిగిన ఒక అత్యాచారం కేసులో అక్కడ చిక్కాడు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో ఉన్న సదరు హంతకుడిని పీవోటీ ద్వారా మధిర జైలులో హాజరు పరిచి తొర్లపాడు సమీపంలో జరిగిన హత్య కేసుపై విచారించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విసన్నపేట, చాట్రాయి, ఆగిరిపల్లిలో ఇతనిపై గతంలో అత్యాచార కేసులు నమోదయ్యాయి. నూజివీడు శివారు శిలువగట్టు ప్రాంతంలో జరిగిన అత్యాచార ఘటనలోనూ ఇతనిపై అభియోగాలు ఉన్నాయి.