Asianet News TeluguAsianet News Telugu

బీమా డబ్బుల కోసం హత్య : ధర్మానాయక్ మర్డర్ చేసిన బాబు వివరాలు ఇవే..

బీమా డబ్బుల కోసం తనలాంటి వ్యక్తిని హత్య చేసి.. డబ్బులు కాజేయాలని పథకం పన్ని పట్టుబడిన కేసులో.. మృతుడి వివరాలను పోలీసులు కనుగొన్నారు. అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

progress in Murder plan for insurance money in nizamabad - bsb
Author
First Published Jan 20, 2023, 10:03 AM IST

నిజామాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన బీమా డబ్బుల కోసం హత్య ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగి లక్షల రూపాయల్లో తాను చేసిన అప్పులను తీర్చేందుకు బీమా సొమ్ము కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన పేరిట ఏడుకోట్ల బీమా చేయించి అచ్చు తనలాగా కనిపించే ఓ వ్యక్తిని ఎంచుకుని చంపేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చనిపోయింది తానేనని నమ్మించి బీమా సొమ్ము కాజేయడానికి ప్రయత్నించాడు.

అయితే ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి  ప్రభుత్వోద్యోగి కాదని బాబు అనే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో చనిపోయిన బాబు స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా లాగాదుల్ గ్రామమని పోలీసులు తెలిపారు. అతని పూర్తి పేరు బాబు మారోతి గలగాయే(42). గతవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని వెంకటాపురం చెరువు వద్ద బాబు హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో నిందితులైన ధర్మనాయక్ అతని మేనల్లుడు, తెజావత్ శ్రీనివాస్ లు బాబును నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారు.

బీమా డబ్బుల కోసం హత్య : నిందితులను పట్టించిన మృతుడి కాళ్లు.. ఎలాగంటే...

నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో బాబు అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు.  అక్కడి నుంచి అతడిని  కారులో తీసుకెళ్లి..  హత్య చేసి మృతదేహం పై పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ కేసులో బాబుకు సంబంధించిన వివరాల కోసం పోలీసులు వెతుకుతున్న క్రమంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని తేలింది. దీంతో బాబు స్థానికత మీద అనుమానం వచ్చింది.  వివిధ రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో బాబు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కినట్లు కనిపించింది. దీంతో  సంబంధిత పోలీస్ స్టేషన్లో నిజామాబాద్ పోలీసులు ఆరా తీశారు.

జీవనోపాధి కోసం కూలీ పనులు వెతుక్కుంటూ నిజామాబాదులో అతడు రైలు దిగినట్లు మృతుని కుటుంబ సభ్యులు రోధిస్తూ తెలిపారు. ఇక మరోవైపు.. బాబు కన్నా ముందు ధర్మానాయక్, శ్రీనివాస్  చంపాలని ప్లాన్ వేసి.. తమతో పాటు నిజామాబాద్ తీసుకువెళ్లిన నాంపల్లికి చెందిన అంజయ్య మిస్సింగ్ పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంజయ్య ఎందుకు తప్పించుకుపోయాడు..  ఎలా తప్పించుకుపోయాడు అనే కోణంలో పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.  అంజయ్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు ఇప్పటికే తీసుకువెళ్లారు.  అంజయ్యను మెదక్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios