Asianet News TeluguAsianet News Telugu

బీమా డబ్బుల కోసం హత్య : నిందితులను పట్టించిన మృతుడి కాళ్లు.. ఎలాగంటే...

బీమా కోసం డ్రామా కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో దహనం కాకుండా ఉండిపోయిన మృతుడి కాళ్లే నిందితులను పట్టించాయి. 

legs of the deceased who caught the accused In Murder for insurance money in Medak - bsb
Author
First Published Jan 19, 2023, 8:10 AM IST

మెదక్ :  ‘బీమా డబ్బుల కోసం హత్య’ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు నిందితులను తొమ్మిది రోజుల్లోనే పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం మెదక్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. నిందితులు పాత్లోత్ ధర్మ (44), అతడి భార్య నీల (43), మేనల్లుడు తేజావత్ శ్రీనివాస్ (30), సోదరి సుంధ (48),  పాత్లోత్ ధర్మ మైనర్ కొడుకు (17)లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పాత్లోత్ ధర్మ రాష్ట్ర సచివాలయంలో సహాయ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నాడు. 

పాత్లోత్ ధర్మ స్థానంలో చనిపోయిన వ్యక్తి  బాబు అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్యకు గురైన బాబుకు సంబంధించిన పూర్తి వివరాలు కనిపెట్టాల్సి ఉంది. నిందితులు ఎలా పట్టుపడ్డారో రోహిణి ప్రియదర్శిని చెప్పుకొచ్చారు.. ‘కారులొ దహనమైన వ్యక్తి కాళ్లు  పూర్తిగా కాలలేదు. అదే ఇది ప్రమాదం కాదని.. హత్యా అని అనుమానించేలా చేశాయి. ఆ కాళ్లు సున్నితంగా లేవు. ఉద్యోగం చేసే వ్యక్తుల కాళ్లలా కనిపించలేదు. దీంతో అనుమానం మొదలైంది. చనిపోయిన వ్యక్తి ధర్మ కాదేమో అనిపించింది. దాంతో ఆ దిశగా విచారణ చేపట్టాం. పాత్లోత్ ధర్మ, అతని మేనల్లుడు శ్రీనివాసులు కలిసి ఈ హత్య పథకాన్ని రూపొందించారని తెలిసింది. బాబు అనే వ్యక్తిని చంపి కారులో ఉంచి.. తగలబెట్టేశారు. పాత్లోత్ ధర్మ చనిపోయినట్లుగా  నాటకం ఆడారు’ అని చెప్పారు.

ఉద్యోగి చేతుల్లోంచి డబ్బు సంచి లాక్కుని పారిపోయిన గవర్నమెంట్ టీచర్.. రూ. 1.50లక్షలు చోరీ..

దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. పాత్లోత్ ధర్మ మెదక్ జిల్లా టేక్మాల్ మండలం, భీమ్లా తండాకు చెందిన వ్యక్తి.  భార్య నీలాతో కలిసి ఉద్యోగరీత్యా కూకట్పల్లిలో ఉంటున్నాడు. ఉద్యోగంతో పాటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవాడు. దీంతో నష్టాల పాలయ్యాడు. రూ.80లక్షలు అప్పులయ్యాయి. అప్పులు తీర్చమంటూ.. అప్పుల వాళ్లు పీకల మీద కూర్చున్నారు. దీంతో వీటిని తీర్చేందుకు ఏదైనా చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి చర్చించాడు. పక్కా ప్రణాళిక తయారు చేశాడు. 

సినిమాల్లో చూపించినట్లుగా తనలాంటి వ్యక్తిని చంపి చనిపోయింది తానేనని నమ్మించి.. బీమా డబ్బు కొట్టేయాలనుకున్నాడు. అంతే కాదు తన భార్యకు తన ఉద్యోగం వస్తుందని.. దీంతో తమ కష్టాలు తీరిపోతాయని  ప్లాన్ వేశాడు. దీనికి భార్యను, కొడుకును, అక్కను, మేనల్లుడిని ఒప్పించాడు. ప్లాన్లో భాగంగా తన పేరిట రూ.7.04కోట్ల విలువైన బీమా పాలసీలను  చేయించాడు. ఏడాది కిందటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అప్పటినుంచి పాత్లోత్ ధర్మలాగా ఉండే వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టారు. అతడి  ప్రయత్నం ఫలించి గత నవంబర్లో నాంపల్లి మెట్రో స్టేషన్ లో తనలాగే ఉన్న అంజయ్య అనే కూలీ దొరికాడు.  

వెంటనే తన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. అంజయ్యతో పరిచయం పెంచుకున్నాడు. నిజామాబాదులో తనకు మామిడి తోట ఉందని అందులో పని చేస్తే నెలకు 20వేల రూపాయలు ఇస్తానని చెప్పి అతడిని నమ్మించాడు. నెల జీతానికి ఆశపడిన అంజయ్య ఒప్పుకున్నాడు. ఈనెల 7వ తేదీన నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన తన మేనల్లుడు శ్రీనివాసుతో కలిసి పాత్లోత్ ధర్మ కూలి అంజయ్యను నిజామాబాద్ కు తీసుకువెళ్లారు. అక్కడికి తీసుకువెళ్లిన మరుసటిరోజే హత్య చేయాలని అనుకున్నారు. కానీ అంజయ్యకు మద్యం అలవాటు ఉండడంతో.. ఆరోజు మద్యం సేవించి ఉండడంతో తమ  పథకాన్ని వాయిదా వేశారు. 

పోస్టుమార్టంలో మందు తాగినట్టు తేలితే బీమా డబ్బులు రావని  ముందుగానే వారికి తెలియడం వల్లే పథకాన్ని వాయిదా వేశారు. ఆ తరువాత అంజయ్య భోజనం చేయడానికి అని వెళ్ళాడు కానీ ఎంతకీ తిరిగి రాలేదు. తమ పథకం ఇంకా లేట్ అవుతుందని అనుకున్న  శ్రీనివాస్, ధర్మలు జనవరి 8వ తేదీన నిజామాబాద్ స్టేషన్కు వెళ్లి బాబు అనే వ్యక్తిని ఎంచుకున్నారు.  అతడికి 42 నుంచి 44 ఏళ్ల వయసు ఉంటుంది. అతడిని పాత్లోత్ ధర్మ కారులో  ఎక్కించుకుని బాసరకు తీసుకువెళ్లారు. అక్కడ అతనికి గుండు చేయించారు. పాత్లోత్ ధర్మ బట్టలు ఇచ్చి  వేసుకోమన్నారు.  

అదేరోజు  హత్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.  రాత్రి 11:30 గంటల సమయంలో కారుతోపాటు టేక్మాల్ మండలం వెంకటాపూర్ శివారు వైపు వచ్చారు. బాబుకు కల్లు తాగించారు. ఆ తర్వాత ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. అక్కడ గొడ్డలి, కర్రలతో బాబును కొట్టి..  చంపేశారు. ఆ తర్వాత కారులో నుంచి తాము దిగిపోయి బాబును ముందు సీట్లో కూర్చోబెట్టారు. పెట్రోల్ పోసి  నిప్పంటించారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత నిజామాబాద్ కు వెళ్లిపోయారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒక్కో ఆధారం సేకరించారు. దీంతో ఈ ప్లాన్ లో  భాగస్వాములైన  ప్రతి ఒక్కరిని అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios