రాష్ట్రంలోని రెండు పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పాటు హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి ఎన్నికలు జరిగాయి.
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పాటు హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి ఎన్నికలు జరిగాయి.
నల్గొండ స్థానానికి నల్గొండలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 17వ తేదీన ఉదయం ప్రారంభమైంది.
నల్గొండ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నపై 11,687 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మొత్తం మూడు రౌండ్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 47,545 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నకు 35,856 ఓట్లు దక్కాయి. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కి 29,590 ఓట్లు లభించాయి.
హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవి ముందంజలో నిలిచారు. రెండు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి వాణీదేవికి 35,171 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్ధి రామచంద్రారావుకి 32,558 ఓట్లు లభించాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాధారణ ఎన్నికల కంటే భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు రోజుల తరబడి సాగే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల్లో ఈసీ జారీ చేసిన గుర్తును బ్యాలెట్ పత్రంపై వేయాలి. ఈ ఎన్నికల్లో మాత్రం ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేయాల్సి ఉంటుంది.
తనకు నచ్చిన అభ్యర్ధికి 1, 2 .. ఇలా అంకెలు వేయాలి.పోటీలో ఉన్న అభ్యర్ధులకు కూడ ఓటు చేసే వెసులుబాటు ఉంటుంది. పోలైన ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చిన అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 3,57,354 ఓట్లు పోలయ్యాయి. వరంగల్- ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి పోల్ అయిన 3,86,320 ఓట్లు నమోదయ్యాయి.
ప్రతి రౌండ్‌లో ఒక్కో టేబుల్‌కు 1000 చొప్పున 56వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ పేపర్లను కలిపి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ చేశాక, ఒక్కోటేబుల్‌కు 1000 ఓట్లు లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌లో 56వేల ఓట్లను లెక్కిస్తారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికీ కూడ సగానికి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చేవరకు కౌంటింగ్ కొనసాగిస్తారు. తొలి ప్రాధాన్యత ఓటు ద్వారా విజయం దక్కకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.
పోటీలో ఉన్న అభ్యర్ధుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్ధులకు పోలైన ఓట్లను పోటీ నుండి ఎలిమినేట్ చేస్తారు. పోటీలో ఉన్న అభ్యర్ధిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్ధికి రెండో ప్రాధాన్యత ఓట్లను ఎక్కువ ఓట్లు వచ్చినవారికి పంచుతారు. ఉదహరణకు పోటీలో ఉన్న అభ్యర్ధుల్లో తొలి పది స్థానాల్లో నిలిచిన అభ్యర్ధులకు 10వ స్థానంలో నిలిచిన అభ్యర్ధికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను పంచుతారు.
ఇలా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్ధులకు రెండో ప్రాధాన్యత ఓట్లను వారికంటే ఎక్కువ ఓట్లు వచ్చినవారికి పంచుతూ తక్కువ ఓట్లు వచ్చినవారిని పోటీనుండి తప్పిస్తారు.ఇలా దిగువ నుండి ఎగువకు తక్కువ ఓట్లు వచ్చినవారిని ఎలిమినేట్ చేస్తారు. ఇలా ఒక్క అభ్యర్ధికి కోటా ఓట్లు వచ్చేవరకు ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు.ఎవరికైతే సగానికి కంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తోందో అప్పటి వరకు ఎలిమినేట్ ప్రక్రియను కొనసాగిస్తారు.
