హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు కావస్తున్నా నేటికి సమాజంలో ఆడవారికి స్వాతంత్ర్యం నేటికీ రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఉదాహరణే మెన్న వరంగల్ లో మానస నేడు డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యలే. 

ఆధునిక యుగంలో కూడా మానవమృగాలు ఆడవారిపై విరుచుకుపడుతున్నారు. కామంతో కళ్లుమూసికుపోయిన దుర్మార్గులు వావి వరుస మరచిపోతున్నారు. మానవ సంబంధాలకు తిలోదకాలు వదులుతున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. 

తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ప్రియాంకరెడ్డి దారుణ హత్యకు గురవ్వడం తెలంగాణ రాష్ట్రంతోపాటు యావత్ భారతదేశం నివ్వెరపోయేలా చేసింది. భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజు అంటే అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడేనని జాతిపిత మహాత్మగాంధీ ఆనాడే తెలిపారు. 

భవిష్యత్ లో ఆడపిల్ల అర్థరాత్రి ఒంటరిగా తిరిగే అవకాశం ఉండదు అని ముందే ఊహించారో లేదో గానీ ఆయన చెప్పింది నిజమేనని తెలుస్తోంది. అర్థరాత్రి 12 కాదు తెల్లవారు జామున ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల సాయంత్రం వచ్చే వరకు ప్రతీ తల్లీ తండ్రి భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. 

అందువల్లే భయటకు ఆడపిల్లను పంపాలంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏమవుతుందోనన్న భయంతో తల్లడిల్లిపోతున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 

దురదృష్టం ఏంటంటే ఎనిమిది నెలల చిన్నారి మెుదలుకొని 80ఏళ్ల వృద్ధురాలి వరకు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా వాటి అమలులో లోపాలు కావచ్చు, జాప్యాలు కావచ్చు బలవుతున్నది మాత్రం ఆడపిల్లలే అన్నది వాస్తవం.

ఒంటరిగా ఇంట్లో ఉంటే రక్షణ కరువు, బడికి వెళ్తే రక్షణ కరువు. ప్రయాణం చేస్తుంటే ఎవరు ఎటువైపు నుంచి వచ్చి ఎలాంటి దారుణానికి ఒడిగడతారో తెలియని పరిస్థితి. దేవాలయాలకు వెళ్లినా ఈ మధ్యకాలంలో అక్కడ కూడా కామాంధులు తయారయ్యారు. 

పవిత్రమైన పుణ్యక్షేత్రంలోనే అత్యాచారం జరిగిన ఘటన కూడా చూస్తూనే ఉన్నాం. చివరికి దేవాలయాల్లో కూడా మహిళలకు రక్షణ కరువైందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి వెళ్తున్నా పోకిరీలు వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. 

భర్త ఉండగా కూడా ఒక గుంపుగా వచ్చి భార్యపై దారుణానికి ఒడిగట్టిన అనేక సంఘటనలను చూస్తూనే ఉన్నాం. భర్త ఎదుటే అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు దేశంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉంది. 

ఇదిలా ఉంటే తల్లిదండ్రులు ఎంతో ఘనంగా వివాహం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను అత్తింటికి పంపితే అక్కడ కూడా ఆడపిల్లకు రక్షణ కరువైంది. కట్నం కోరలకు, అత్తింటి వేధింపులకో అబలలు బలవుతూనే ఉన్నారు. 

ఇదిలా ఉంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా భ్రూణహత్యలు పేరుతో ఆడశిశువును అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ పరిస్థితుల్లో చూసినా ఉద్యోగ బాధ్యతల్లో రాజకీయాల్లో అనేక రంగాలలో ఆడవారికి రక్షణ కరువైందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఆధునిక యుగంలో ప్రతీ వ్యక్తి వేల రూపాయలతో కొనుగోలు చేసిన తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను చూస్తున్నంత జాగ్రత్త ఆడపిల్లపై ఉండటం లేదన్నది నగ్న సత్యం. ఆడపిల్లలపై వేధింపులకు అనేక చట్టాలు ఉన్నా వాటిలోని కొన్ని లోపాలను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు ఈజీగా బయటపడిపోతున్నారు. 

పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నా కోర్టుల ద్వారానో చట్టంలో లోపాల వల్లనో వారు బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. ఒక దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి బెయిల్ పై మళ్లీ తిరిగి రావడంతో మరోక వ్యక్తి దారుణానికి ఒడిగట్టే అవకాశం లేకపోలేదు.  

మద్యం మత్తుకు గురయ్యో, పెంపకం లోపమో తెలియదు గానీ కొందరు మగవాళ్లు మానవ మృగాలుగా మారుతున్నారు. వారి చేతుల్లోపడి ఎందరో ఆడపిల్లలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే భారతదేశంలో స్త్రీ నిష్పత్తి తగ్గిపోతుంది. ఉన్నవారిని కాపాడుకుందామంటే ఇలా కామాంధుల బలిదానాలకు మరి కొందరు విగతజీవులుగా మారిపోతున్నారు.  

తాను ఒక తల్లి జన్మనిస్తేనే ఈ భూమ్మీద పడ్డానని ఆ మానవ మృగం గుర్తించడం లేదు. ఒక ఆడపిల్లను చూస్తే తన తల్లో చెల్లో, లేక బంధువో గుర్తుకు వచ్చినప్పుడు ఇలాంటి ఘటనలకు స్వస్తి చెప్పగలం. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 

ఇప్పటికైనా ప్రభుత్వాల్లో మార్పులు రావాలి. ఇతరదేశాల్లో అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష అమలులో ఉంది. అలాంటి కఠిన శిక్షలను భారతదేశంలో కూడా అమలు చేయడంతోపాటు దోషులు తప్పించుకోకుండా చర్యలు తీసుకుని ఉరితీస్తేగానీ సమాజంలో మార్పు రాదనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే ప్రియాంక రెడ్డి విషయానికి వస్తే ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. డాక్టర్ గా తనకు ఉన్న బాధ్యతను నెరవేర్చేందుకు స్కూటీ పై డ్యూటీకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మదమెక్కిన, మత్తెక్కిన కామాంధుల కబంధ హస్తాలలో చిక్కి బలైపోయింది.

ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అందరూ కోరుకుందాం. ప్రియాంకరెడ్డి అనుభవించిన నరకయాతన ఏ ఆడబిడ్డ అనుభవించకూడదని దేవుడిని మెుక్కుదాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆడపిల్లను కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ ప్రయత్నించాలని కోరుకుందాం. ఆడపిల్లను కాపాడుకుందాం. రేపటి తరానికి అమ్మను ఇద్దాం.

ప్రియాంకరెడ్డి తల్లి అనుభవిస్తున్న మానసిక క్షోభ ఇక ఏ తల్లి పడకూడదంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న ప్రియాంకరెడ్డి కామాంధుల కబంధ హస్తాల్లోచిక్కుకుపోవడం బాధాకరం. ఆమెను కోల్పోవడం విచారకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంతా కలిసి పోరాటం చేద్దాం. ఆడపిల్లను కాపాడుకుందాం. మన అమ్మలాంటి మరో అమ్మను తెచ్చుకుందాం.