Asianet News TeluguAsianet News Telugu

మునుగోడుపై వేగం పెంచిన కాంగ్రెస్.. రేపు ఢిల్లీలో కీలక సమావేశం.. తెలంగాణపై ప్రియాంక గాంధీ ఫోకస్..!

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ.. మంగళవారం (ఆగస్టు 23)  న్యూఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. 

Priyanka Gandhi To Meet Telangana Congress Leaders tomorrow
Author
First Published Aug 22, 2022, 9:42 AM IST

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ.. మంగళవారం (ఆగస్టు 23)  న్యూఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌‌లు పాల్గొంటారు. టీ కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి, ప్రచార, ఎన్నికల కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ‌, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. ఇతర ముఖ్యనేతలు పాల్గొనే అవకాశం ఉంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు ప్రచార వ్యూహాన్ని మెరుగుపరుచుకోవడంపై చర్చించనున్నారు.

అలాగే రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి రెడ్డికి, ఇతర సీనియర్లకు మధ్య ఉన్న విభేదాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి సంబంధించిన ఇతర అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ నేతృత్వంలో సమావేశం జరుగుతుండటం.. ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. రాహుల్ గాంధీ ఇతర పనుల్లో చాలా బిజీగా ఉన్నారని ఏఐసీసీ నేతలు చెబుతున్నప్పటికీ.. ప్రియాంక టీపీసీసీ బృందానికి సమయం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై ప్రియాంక దృష్టి సారించిందనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. టీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్‌ను పార్టీ ఇన్‌చార్జి కార్యదర్శిగా రంగంలోకి దింపింది. దీంతో ఆయన కొద్ది రోజులుగా పార్టీలోని పలువురు నేతలతో చర్చలు జరిపారు. వారి వద్ద నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.  రేవంత్‌ వ్యవహారశైలి, మాణిక్యం ఠాగూర్‌, సునీల్‌ కానుగోలుపై సంచలన ఆరోపణలు చేసిన సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి‌తో కూడా నదీమ్ జావేద్ భేటీ అయ్యారు. ఆయన అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఈ సమాచారం అంతా నదీమ్ జావేద్ నేరుగా ప్రియాంక గాంధీ నివేదించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 

ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారా? లేదా? అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ కామెంట్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన వెంకట్ రెడ్డి.. ఉప ఎన్నికపై చర్చలపై తనకు సమాచారం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ కోమటిరెడ్డి మాత్రం అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరిచాలని డిమాండ్ తీసుకొచ్చారు. తాజాగా తాను మునుగోడులో ప్రచారానికి సిద్దమని ప్రకటించిన వెంకట్ రెడ్డి.. అయితే  స్టార్ క్యాంపెయినర్‌గా తనకు బాధ్యతలు అప్పగించాలని కోరినట్టుగా వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా శనివారం మునుగోడు నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలకు వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ  క్రమంలోనే ప్రియాంక నేతృత్వంలో సమావేశానికి రావాల్సిందిగా.. టీ కాంగ్రెస్ నేతలకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరవుతారా?, హాజరైతే ఆ సమావేశంలో ఏ విషయాలను ప్రస్తావిస్తారానేది తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios