పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన దుర్ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

పెద్దపల్లి : పెళ్లి బృందంతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాద్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న పెళ్లిబృందం తిరిగి రామగుండం వెళుతుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. దీంతో కొందరు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. 

 పెద్దపల్లి జిల్లాకు రామగుండంకు చెందిన ముస్లిం కుటుంబం నిన్న(ఆదివారం) బంధువులతో కలిసి హైదరాబాద్ లో పెళ్లికి వెళ్ళారు. గోదావరిఖనికి చెందిన మహవీర్ ట్రావెల్స్ బస్సులో 40మందితో కూడిన పెళ్లిబృందం హైదరాబాద్ వెళ్లింది. అర్ధరాత్రి వరకు వివాహ వేడుకలో పాల్గొన్న వీరు అదే రాత్రి తిరుగుపయనం అయ్యారు.

ఇవాళ(సోమవారం) ఉదయం పెళ్లిబృందం బస్సు పెద్దపల్లి జిల్లాలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ సమీపంలో వేగంగా వెళుతున్న బస్సుకు హటాత్తుగా ఓ టాటా ఏస్ వాహనం అడ్డువచ్చింది. దీంతో దాన్ని తప్పించబోయి అదుపుతప్పిన బస్సు డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడింది.

Read More హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం, దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోరం

ఈ ప్రమాదంలో బస్సులోని కొందరు తీవ్ర గాయాలపాలవగా మరికొందరు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. 

వీడియో

ప్రమాదస్థలికి చేరుకున్ని పెద్దపల్లి ఏసీపీ మహేష్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులందరినీ హాస్పిటల్ కు తరలించిన తర్వాత ట్రాఫిక్ అంతరాయం కలగకుండా బస్సును రోడ్డుపైనుండి తొలగించారు.