కామారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీ ఆకస్మిక మృతి... కారణమదేనా?
జైల్లో వున్న రిమాండ్ ఖైదీ ఒక్కసారిగా మృతిచెందాడు. అతడి మృతికి అనారోగ్యమే కారణమని పోలీసులు చెబుతున్నారు.

కామారెడ్డి : జైల్లో రిమాండ్ ఖైదీ మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి సబ్ జైల్లోని ఖైదీ కడుపునొప్పితో బాధపడుతుంటే పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యా నాయక్ తండాకు చెందిన యూసఫ్ సొంత అక్కను అతిదారుణంగా చంపాడు. నడి రోడ్డుపై అక్క రుక్సానాను నరికి చంపిన యూసఫ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కామారెడ్డి సబ్ జైల్లో వున్న యూసఫ్ నిన్న అనారోగ్యం పాలయ్యాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న అతడికి జైలు సిబ్బంది నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న యూసఫ్ తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రాణాలు కోల్పోయాడు.
Read More భారీ వర్షాలతో ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు మృతి.. పిడుగుపడి ఇద్దరు, వాగులో కొట్టుకుపోయి మరొకరు..
జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న యూసప్ మృతిపై ఆయన కుటుంబంసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అతడి మృతికి అనారోగ్యమే కారణమా లేక ఇంకేదైనా కారణాలున్నాయా అన్నది తెలియాల్సి వుంది. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాతే యూసఫ్ మృతికి కారణమేంటో తెలియనుంది.