తెలుగు రాష్ట్రాల్లో వివిధ దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే తిరుమల, విజయవాడ దుర్గగుడిలో అర్చకులు, సిబ్బందికి కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయంలోనూ ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఇప్పటికే ఆలయంలో పనిచేసే  ఓ అర్చకుడు, మరో ఉద్యోగికి కోవిడ్ సోకింది. దీంతో తమకు కరోనా  పరీక్షలు చేయించాలంటూ మిగిలిన సిబ్బంది అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో 2257 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77513కు చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో మరో 14 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 615కు చేరుకుంది. గత 24 గంటల్లో హైదరాబాదులో 500కు తక్కువగా కేసులు నమోదు కావడం విశేషం. 

జిహెచ్ఎంసీ పరిధిలో 464 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కరీంనగర్ లో సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కరీంనగర్ జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, వరంగల్ అర్భన్ జిల్లాల్లో యధాస్థితి కొనసాగుతోంది. 

మేడ్చెల్ మల్కాజిరిగి జిల్లాలో 138 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 181 కేసులు రికార్డయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 187 కేసులు నమోదయ్యాయి.