మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. నిండు గర్భిణిని హాస్పిటల్లో చేర్చుకోకపోవడంతో ఆమె బాత్రూంలోనే బిడ్డను ప్రసవించింది.
సిరిసిల్ల: ఏళ్లు గడుస్తున్నాయి... రాతి యుగం నుండి రాకెట్ యుగానికి చేరుకున్నాం... ప్రభుత్వాలు మారుతున్నాయి... రోడ్లు, నీటిపారుదల, వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ ఇలా ప్రతిదాంట్లో మార్పులు వచ్చాయి... ప్రతి వ్యవస్థ గతంలో కంటే చాలా మెరుగుపడ్డాయి... ఒక్క ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితి, వాటిలో సిబ్బంది నిర్లక్ష్యం తప్ప. ఇప్పటికీ ప్రభుత్వాస్పత్రుల్లో పేషెంట్స్ ని కొరికిన ఎలుకలు, స్ట్రెచర్లు లేకపోవడంతో పేషెంట్స్ ని చేతుల్లో మోసిన కుటుంబీకులు, సిబ్బంది నిర్లక్ష్యంతో మరణాలు, మృతదేహాలను బైక్ లపై తీసుకెళ్లిన కుటుంబసభ్యులు... ఇలాంటి వార్తలు వింటూనే వున్నాం. చివరకు నిండు గర్భిణి బాత్రూంలో బిడ్డను ప్రసవించిందంటే ప్రభుత్వ దవాఖానాల్లో పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతుంది.
తాజాగా ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నిండు గర్భిణి పురిటినొప్పులతో జిల్లా హాస్పిటల్ కు వెళ్లగా ప్రసవానికి మరింత సమయం వుందనిచెప్పి వైద్యసిబ్బంది ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వెళ్లిన మహిళ బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పసిగుడ్డు మృతిచెందగా మహిళ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలానికి చెందిన నిండు గర్భిణికి పురిటినొప్పులు రావడంతో జిల్లా హాస్పిటల్ కుటుంబసభ్యులు తీసుకువెళ్లారు. అయితే డెలివరీకి మరికొద్దిరోజుల సమయం వుందని చెప్పి హాస్పిటల్ సిబ్బంది గర్భిణిని వెనక్కిపంపారు. ఆ తర్వాతి రోజు కూడా గర్భిణి పురిటి నొప్పులతో బాధపడతంలో మళ్ళీ హాస్పిటల్ కు తీసుకెళ్ళగా ప్రసవానికి ఇంకా 20 రోజుల సమయం వుందని చెప్పి డాక్టర్లు వెనక్కి పంపారు.
ఇలా హాస్పిటల్లో చేర్చుకోకపోవడంతో చేసేదేమీలేక కుటుంబసభ్యులు పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే బాత్రూంకు వెళ్లిన సమయంలో మహిళ ప్రసవించింది. కానీ పుట్టినవెంటనే పాప మృతిచెందగా తల్లి పరిస్థితి కూడా విషమిచింది. దీంతో ఆమెను అదే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా వుడటంతో బాధిత మహిళను ఐసియూలో వుంచి చికిత్స అందిస్తున్నారు.
ఇలా వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ తల్లికి కడుపుకోత మిగలడమే కాదు ప్రాణాలమీదకు వచ్చింది. ఇంత .జరిగినా సిరిసిల్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ అదే నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. ఇంకో 20 రోజులు డెలివరీ టైం ఉన్నందున ఇంటికి పంపామని.... ఇందులో తమ తప్పేమీ లేదని అంటున్నారు.
ఈ ఘటన గురించి తెలియడంతో బాధిత కుటుంబానికి బిజెపి అండగా నిలిచింది. బాధిత మహిళకు మెరుగైన చికిత్స అందించాలని... పసిపాప మరణానికి కారణమైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ బిజెపి నాయకులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఇక గతేడాది కరీంనగర్ లో ఇలాంటి దారుణమే వెలుగుచూసింది.గుర్తుతెలియని మహిళ రోడ్డుపక్కన పబ్లిక్ టాయిలెట్స్ లో అర్దరాత్రి బిడ్డకు జన్మనిచ్చింది. తెల్లవారాక బాత్రూంలో పసిబిడ్డ మృతిచెంది కనిపించడం కలకలం రేపింది.
కరీంనగర్ పట్టణంలోని రామ్ నగర్ చేపల మార్కెట్ సమీపంలో పబ్లిక్ బాత్రూం వుంది. చేపలు విక్రయించడానికి వచ్చినవారు ఇదే బాత్రూం ఉపయోగించుకుంటారు. అయితే గత డిసెంబర్ లో ఓ మహిళ ఈ బాత్రూంలోనే ప్రసవించి బిడ్డను అందులోనే వదిలి వెళ్లిపోయింది. బిడ్డ మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించి పోలీసుల సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
