హృదయవిదారకం... పరీక్ష రాస్తూ ప్రాణాలు కోల్పోయిన నిండు గర్భిణి
ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలన్న కల నెరవేరకుండానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా టెట్ పరీక్ష రాయడానికి వెళ్లిన గర్భిణి ఎగ్జామ్ సెంటర్లోనే కుప్పకూలి మృతిచెందింది.

హైదరాబాద్ : ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో భాగంగా ఇవాళ(శుక్రవారం) నిర్వహిస్తున్న టెట్(టీచర్ ఎలిజబిలిటి టెస్ట్) పరీక్ష రాసేందుకు వెళ్లి ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. పరీక్షా సెంటర్ కు చేరుకున్న గర్భిణి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారులోని ఇస్నాపూర్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో అరుణ్, రాధిక దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు కాగా ప్రస్తుతం రాధిక గర్భంతో వుంది. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న రాధిక ఇవాళ జరుగుతున్న టెట్ పరీక్షకు హాజరయ్యింది. పటాన్ చెరు సమీపంలోని ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమెకు సెంటర్ పడింది. దీంతో భర్త అరుణ్ తన బైక్ పై రాధికను పరీక్షా సెంటర్ కు తీసుకువచ్చాడు.
పరీక్షకు ఎక్కడ ఆలస్యం అవుతుందోనని కంగారుపడిపోయిన రాధిక పరుగెత్తుకుంటూ సెంటర్ వద్దకు చేరుకుంది. ఇలా ఎనిమిది నెలల నిండు గర్భంతో వున్న ఆమె పరుగెత్తడంతో బిపి ఎక్కువయిపోయింది. దీంతో పరీక్షా సెంటర్ లోనే ఆమె కుప్పకూలిపోగా సిబ్బంది ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు అపస్మార స్థితిలో వున్న భార్యను పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే రాధికతో పాటు కడుపులోకి పిండం ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.
Read More కూకట్ పల్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం కథ విషాదాంతం...
ప్రభుత్వ ఉద్యోగం సాధించి భర్త, పిల్లలలో హాయిగా జీవించాలన్న కలగన్న రాధిక ఆ ప్రయత్నంలోనే అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆమె మృతి ఇటు అత్తవారింట్లో, అటు పుట్టింట్లో విషాదాన్ని నింపింది. రాధిక మృతదేహం వద్ద భర్త రోదించడం చూసేవారికి కన్నీరు తెప్పిస్తోంది.