వైద్యం కోసం వెళ్లిన నిండు గర్భిణి బాత్రూంలోనే బిడ్డకు జన్మనిచ్చిన ఘటన నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది.
నల్గొండ : కాలానికి తగ్గట్లుగా అన్నీ మారుతున్నాయి... ఒక్క ప్రభుత్వాసుపత్రుల తీరు తప్ప. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ హాస్పిటల్స్ నూ వున్న అపవాదును తొలగించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి... కానీ వాటిలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది తీరు మారడం లేదు. ఇలా తెలంగాణలోని ఓ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండుగర్భిణి బాత్రూంలో బిడ్డను ప్రసవించింది.
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన లింగయ్య పార్వతమ్మ నిండు గర్భిణి. నొప్పులు రాకపోయినా ముందుజాగ్రత్తగా ప్రసవం కోసం నల్గొండ ప్రభుత్వాస్పత్రికి భర్తతో కలిసి వెళ్లింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ప్రసవానికి మరో వారంరోజులు పడుతుందని చెప్పారు. కానీ బుధవారం బాత్రూంకు వెళ్లిన సమయంలో పార్వతమ్మకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. ఈ నొప్పులతో బయటకు రాలేకపోయిన ఆమె అక్కడే బిడ్డను ప్రసవించింది.
Read More భర్త పురుగులమందు తాగాడని భార్య ఆత్మహత్య.. కూతురు మృతి తట్టుకోలేక సంపులోకి దూకి తల్లి బలవన్మరణం..
హాస్పిటల్ సిబ్బంది వెంటనే పుట్టిన శిశువుతో పాటు తల్లిని ఐసియుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా బాత్రూంలో ప్రసవించిందని పార్మతమ్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల మాత్రం సాధారణ ప్రసవం కోసమే ఆమెను ఆపినట్లు... ఒక్కసారిగా నొప్పులు రావడంతో బాత్రూంలో ప్రసవించిందని అంటున్నారు. ఏదేమైనా ఇలా నిండు గర్భిణి బాత్రూంలో ప్రసవించడంతో మరోసారి ప్రభుత్వాసుపత్రుల తీరుపై చర్చ మొదలయ్యింది.
ఇదిలావుంటే ఇటీవల హాస్పిటల్ ఎదుటే మహిళ బిడ్డను ప్రసవించిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా హాస్పిటల్ కు నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ వెళ్లింది. సహాయకులు లేకుండా ఒంటరిగా వచ్చిందన్న కారణంగా ఆమెకు వైద్యం చేసేందుకు సిబ్బంది నిరాకరించారు.వైద్యం కోసం హాస్పిటల్ సిబ్బంది కాళ్లా వేళ్లా పడ్డా ఫలితం లేకపోవడంతో పురిటినొప్పుతోనే గర్భిణి బయటకు వచ్చింది. ఇలా బయట రోడ్డుపైకి రాగానే నొప్పులు ఎక్కువై రోడ్డుపై పడిపోయింది. అయినా హాస్పిటల్ సిబ్బంది ఏమాత్రం కనికరం చూపించకుండా అలాగే చూసిచూడనట్లు వదిలేసారు.
పురిటినొప్పులతో గర్భిణి రోడ్డుపై పడటం చూసిన కొందరు మహిళలు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేసే వ్యక్తి ముందుకువచ్చి ఆమెకు రోడ్డుపైనే ప్రసవం చేసాడు. ఈ సమయంలో కొందరు మహిళ చుట్టూ దుప్పట్లను అడ్డుగా పట్టుకున్నారు. గర్భిణ నొప్పులను భరించలేక గట్టిగా అరుస్తూ రోడ్డుపైనే బిడ్డను ప్రసవించింది. ఇలా రోడ్డుపైనే ప్రసవం జరిగినా తల్లీ, బిడ్డా క్షేమంగా వున్నారు.
హాస్పిటల్ ఎదుటే మహిళ రోడ్డుపై ప్రసవవేదన అనుభవించడం, సాటి మనుషలు ఆమెకు సహాయం చేయడాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అదికాస్తా వైరల్ గా మారి వైద్యసిబ్బంది తీరుపై నెటిజన్ల నుండి ఆగ్రహం వ్యక్తమయింది.
