భర్త వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకునే సమయంలో ఐదు నెలల గర్భిణీ కావడం గమనార్హం. ఈ విషాదకర సంఘటన జగర్దిరీ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...పాపిరెడ్డి నగర్ కి చెందిన కృష్ణ ప్రియ అనే యువతికి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కాగా.. పెళ్లి సమయంలో ఐదు లక్షలు కట్నంగా ఇచ్చారు. అయితే.. కొంతకాలం పాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత అదనపు కట్నం కావాలంటూ భర్త శ్రవణ్, అత్త, మామలు వేధించడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో కృష్ణ ప్రియ గర్భం దాల్చింది. శ్రీమంతం సమయంలోనూ ఆమె పుట్టింటి వారు ఐదు కాసుల బంగారం పెట్టాలంటూ ఒత్తిడి చేశారు. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లో ఉండనిస్తామంటూ బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో.. వారి వేధింపులు తట్టుకోలేక ఐదు నెలల గర్భంతో ఉండగానే ఆత్మహత్య చేసుకుంది.

ఇంట్లో ఉరివేసుకొని చనిపోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా.. అత్తింటి వారే చంపేశారని కృష్ణ ప్రియ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.