ప్రగతి భవన్ కు, రాజ్ భవన్ కు మధ్య పెరిగిన విభేదాలను ఈ ఉగాది పండగ సందర్భంగా తగ్గించుకోవాలని గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారు. నేటి సాయంత్రం రాజ్ భవన్ లో నిర్వహించే ముందస్తు ఉగాది వేడుకలకు గవర్నర్ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపించారు. మరి ఈ వేడుకలకు సీఎం హాజరువుతారా లేదా అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
రాజ్ భవన్ కు, సీఎం కేసీఆర్ కు చాలా కాలంగా దూరం పెరిగింది. గత కొంత కాలంగా సీఎం రాజ్ భవన్ కు వెళ్లడమే లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు, సీఎం కేసీఆర్ కు మధ్య విభేదాలు వచ్చాయని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గవర్నర్ తన అధికార నివాసమైన రాజ్ భవన్ లో ముందస్తుగా ఉగాది వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. మరి ఈ కార్యక్రమానికి సీఎం హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
విభేదాలు సమసిపోయేనా ?
చాలా కాలంగా సీఎంకు, గవర్నర్ కు విభేదాలు ఉన్నట్టు బహిరంగంగానే వెల్లడవుతోంది. మొదటి సారిగా హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు ఇది బయటపడింది. ఆ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని ప్రభుత్వం భావించింది. ఆయనను స్పోర్ట్స్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించిన ఫైల్ పై గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. దీని వల్ల మొదటి సారి ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య విభేదాలు ఉన్నట్టు బహిర్గతమైంది.
ధ్యానం కొనుగోళ్ల వివాదం సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ సమయం నుంచే గవర్నర్ కు, సీఎంకు మధ్య విభేదాలు మొదలు అయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే సామాన్యుల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు, రాజ్ భవన్ ప్రాంగణంలో గ్రీవెన్స్ డబ్బాలను గవర్నర్ ఏర్పాటు చేశారు. ఈ విషయం కూడా ప్రభుత్వానికి ఇష్టం లేదని తెలుస్తోంది. రిపబ్లిక్ డే వేడుకల సమయంలో సాధారణంగా ప్రభుత్వం పంపించే ప్రసంగాన్ని గవర్నర్ చదవాలి. కానీ ఈ వేడుకల సమయంలో గవర్నర్ కు అలాంటి ప్రసంగం ఏమీ ప్రభుత్వం పంపించలేదు. కరోనా ఉన్న నేపథ్యంలో ఈ వేడుకలను మాములుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకే గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది.
అయితే ప్రభుత్వం ప్రసంగం ఉండదని చెప్పినప్పటికీ.. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మరింత వైద్య సదుపాయాలు పెరగాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. దీంతో అధికార పార్టీ పెద్దలు తీవ్రంగా స్పందించారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదటు అయ్యాయి. ఈ అంశాన్ని గవర్నర్ తప్పుపట్టారు.
ఇదిలా ఉండగా కావాలనే గవర్నర్ కు ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వడం లేదని తమిళ సై అంటున్నారు. కానీ బీజేపీ రాజకీయాలకు రాజ్ భవన్ కేంద్రకంగా మారాయని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్య జరిగిన సమ్మక్క - సారక్క జాతరకు గవర్నర్ వెళ్లాలని అనుకున్నారు. దీని కోసం ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని తమిళ సై కోరారు. కానీ ఈ సదుపాయం ప్రభుత్వం కల్పించలేదు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు విభేదాలు మరింత ఎక్కువయ్యాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో విభేదాలను పక్కన పెట్టి ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్ ను రాజ్ భవన్ కు గవర్నర్ ఆహ్వానించారు. నేటి సాయంత్రం 7 గంటలకు ఈ ముందస్తు వేడుకలు రాజభవన్ లో జరుగుతాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్, అలాగే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి, అలాగే ఇతర రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా గవర్నర్ ఆహ్వానం పంపించారు. మరో వైపు రేపు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కూడా ఉగాది వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. మరి నేడు ప్రగతి భవన్ లో నిర్వహించే వేడుకలకు సీఎం హాజరవుతారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
