ఆస్తి కోసం: నిజామాబాద్‌లో 9 రోజుల్లో ఆరుగురి హత్యలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం ఈ హత్యలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యలకు పాల్పడిన నిందితుడు ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆస్తి వివాదాల కారణంగానే ఈ హత్యలు జరిగినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణ తేలింది.
ఈ నెల 9 నుండి వారం రోజుల వ్యవధిలో ప్రసాద్ కుటుంబానికి చెందిన ఆరుగురిని ప్రశాంత్ అనే వ్యక్తి హత్య చేశాడు. ప్రసాద్ భార్య రమణిని తీసుకెళ్లి బాసర వద్ద గోదావరి నదిలో పడేశాడు ప్రశాంత్.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మాక్లూరుకు చెందిన ప్రశాంత్, ప్రసాద్ లు ఇద్దరు స్నేహితులు. వీరిద్దరిపై కూడ నేరారోపణలున్నాయి. ప్రశాంత్ మాత్రం గ్రామం విడిచి నిజామాబాద్ పట్టణంలో నివాసం ఉంటున్నారు.
మరో వైపు ప్రసాద్ తల్లి, ఇద్దరు చెల్లెళ్లు, భార్య, పిల్లలతో కలిసి కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు.అప్పుల కారణంగా ప్రసాద్, ప్రశాంత్ ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ప్రసాద్ ఇంటిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయిస్తే బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని ప్రశాంత్ నమ్మించాడు. దీంతో ప్రశాంత్ మాటలు నమ్మిన ప్రసాద్ తన ఇంటిని ప్రశాంత్ పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే ఎంతకీ బ్యాంకు లోన్ ప్రశాంత్ ఇప్పించలేదు.దీంతో ప్రసాద్ తన ఇంటిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రశాంత్ పై ఒత్తిడి తెచ్చాడు. అయితే తిరిగి ప్రసాద్ పేరుతో ఇంటిని రిజిస్ట్రేషన్ చేయిస్తే తనకు ఆ ఇల్లు దక్కదని ప్రశాంత్ భావించాడు. ప్రసాద్ కుటుంబాన్ని అంతమొందిస్తే ఆ ఇల్లు తనకే స్వంతమౌతుందని ప్రశాంత్ భావించాడు.
తొలుత ఈ నెల 9న ప్రసాద్ ను హత్య చేశాడు. డిచ్ పల్లి జాతీయ రహదారి పక్కన ప్రసాద్ మృతదేహన్ని పూడ్చి పెట్టాడు.ఆ తర్వాత ప్రసాద్ ఇంటికెళ్లి పోలీసులు ప్రసాద్ ను అరెస్ట్ చేశారని నమ్మించి ప్రసాద్ భార్య రమణిని తనతో తీసుకెళ్లాడు. ప్రసాద్ భార్యను హత్య చేసి బాసర వద్ద గోదావరి నదిలో వేశాడు. ప్రసాద్, అతని భార్యను కూడ పోలీసులు అరెస్ట్ చేశారని నమ్మించి ప్రసాద్ ఇద్దరు కూతుళ్లను నిర్మల్ జిల్లాకు కు సమీపంలోని సోన్ బ్రిడ్జి వద్ద హత్య చేశాడు. ప్రసాద్ సోదరిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ వద్ద చంపాడు. సదాశివనగర్ లో ప్రసాద్ సోదరి మృతదేహం ఆధారంగా పోలీసులు విచారణ జరపడంతో ఈ ఆరుగురి హత్య విషయం వెలుగు చూసింది.
సదాశివనగర్ లో మహిళ హత్య కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ప్రసాద్ తల్లి కూడ పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకు ప్రసాద్, ఆయన భార్య, పిల్లలు, ప్రసాద్ సోదరిని తీసుకెళ్లిన తర్వాత వారు ఇంతవరకు రాలేదని ప్రసాద్ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ప్రశాంత్ పై ప్రసాద్ తల్లి అనుమానం వ్యక్తం చేసింది. సదాశివనగర్ లో మహిళ హత్య కేసు విచారిస్తున్న పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ప్రశాంత్ ఫోన్ సిగ్నల్స్ అదే ప్రాంతంలో లభించడంతో అతడిని విచారించడంతో ఈ ఆరు హత్యల విషయం వెలుగు చూసింది.
తొలి మూడు హత్యలను ప్రశాంత్ ఒక్కడే చేశాడు. అయితే మిగిలిన మూడు హత్యలకు ప్రశాంత్ తో పాటు మరికొందరున్నారని పోలీసులు గుర్తించారు. వీరిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.