మిర్యాలగూడలో ఇటీవల ప్రణయ్ అనే యువకుడు పరువు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. తక్కువ కులస్థుడిని తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో మారుతీరావు అనే వ్యక్తి అల్లుడు ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించాడు. ప్రస్తుతం మారుతీరావు పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. పరువు హత్యకు గురైన ప్రణయ్ కి విగ్రహం ఏర్పాటు చేయాలని అతని భార్య అమృత, కుటుంబసభ్యులు కోరుతున్నారు. దీనికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. విగ్రహం కట్టడమే తరువాయి అనుకున్న తరుణంలో కొందరు ట్విస్ట్ ఇచ్చారు. ప్రణయ్ విగ్రహాన్ని నిర్మించడానికి వీలు లేదంటూ కొందరు తల్లిదండ్రులు ఆందోళణ చేపట్టారు.

తాజాగా నిందితుడు మారుతీరావుకి ఆర్యవైశ్యులు మద్దతుగా నిలిచారు. నల్లగొండలోని వాసవీభవన్‌ నుంచి జైలు వరకు ఆర్యవైశ్య సంఘం, తల్లిదండ్రుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జైలులో ఉన్న మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌తో ములాకత్‌ అయ్యారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దంటూ వినతిపత్రాలు సమర్పించారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటుతో తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు.