మిర్యాలగూడలో శుక్రవారం జరిగిన పరువు హత్య నిరసనగా మిర్యాలగూడలో బంద్‌ పాటిస్తున్నారు. నల్లజెండాలతో దళిత సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో ప్రణయ్ అనే యువకుడిని యువతి తండ్రి దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే.

కాగా..రేపు సొంతూరులో ప్రణయ్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఉక్రెయిన్‌లో ఉన్న ప్రణయ్ సోదరుడు వచ్చిన వెంటనే అంత్యక్రియలు జరుగనున్నాయి. తనకు ఇష్టం లేకుండా కూతురిని పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతో కూతురి భర్త అని కూడా చూడకుండా తండ్రి మారుతీరావు... ప్రణయ్‌ను హత్య చేయించాడు. 

గర్భవతి అయిన భార్యను ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి వెళ్తుండగా పట్టపగలే నడిరోడ్డుపై ఓ దుండగుడు ప్రణయ్ మెడపై కత్తితో నరికాడు. కత్తితో బలంగా నరకడంతో ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ప్రణయ్‌ను హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.