ప్రణయ్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రణయ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్య కేసులో ఏడుగురు నిందితులను మంగళవారం జిల్లా ఎస్పీ రంగనాథ్‌ అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

నల్గొండ : ప్రణయ్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రణయ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్య కేసులో ఏడుగురు నిందితులను మంగళవారం జిల్లా ఎస్పీ రంగనాథ్‌ అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రణయ్‌ భార్య అమృత వర్షిణి, అతని తల్లిదండ్రులు, సోదరుడు అజయ్ లు జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, ఎస్పీ రంగనాథ్‌లను కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలిశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. 
మారుతీరావు బయటకు వస్తే మళ్లీ ఇలాంటి హత్యలే చేస్తాడని భయమేస్తోందని ప్రణయ్ తండ్రి బాలస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు ఉరిశిక్ష పడితే సంతోషిస్తామన్నారు. ప్రణయ్ ని చంపిన వారు భవిష్యత్ లో తమను చంపరన్న నమ్మకం ఏముందని...అమృతను కిడ్నాప్ చేసి మా నుంచి దూరం చేసే ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ పెట్టి కొత్త చట్టాలను తీసుకువచ్చి జైలు నుంచి బయటకు రాకుండా చూడాలని కోరాడు. 

మరోవైపు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు ప్రణయ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. 

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈనెల 14న ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ప్రణయ్‌ను సుభాష్‌శర్మ అనే కిరాయి హంతకుడు కత్తితో నరికి చంపాడు. ఈ హత్య అమృత వర్షిణి తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్ లు సుఫారీ గ్యాంగ్ తో చేయించారు. మెుత్తం ఈ హత్యకేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రణయ్ హత్య కేసులో నిందితులను మిర్యాల గూడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది కోర్టు. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రణయ్ హత్యకేసు నిందితులకు 14 రోజుల రిమాండ్

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

ప్రణయ్ హత్య: మారుతీరావుకు ఉరిశిక్ష విధించాలి.. హైదరాబాద్‌లో ఏఐవైఎఫ్ ఆందోళన