హైదరాబాద్: ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎంపిక కావడంలో ప్రణబ్ ముఖర్జీ కీలకపాత్ర పోషించారనే ప్రచారం అప్పట్లో ఉండేది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2009 ఎన్నికల్లో రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించారు. 

దీంతో అప్పటి మంత్రి రోశయ్యను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఆ సమయంలో జగన్ ఓదార్పు యాత్ర ను చేపట్టారు. మరోవైపు తెలంగాణలో తెలంగాణ కోసం తీవ్రమైన ఉద్యమం సాగుతోంది. దీంతో రోశయ్య తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్తగా ముఖ్యమంత్రి పదవికి మరొక నేతను ఎంపిక చేయాల్సిన అనివార్య పరిస్థితులు కాంగ్రెస్ పార్టీపై పడ్డాయి.

ఏపీ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు గాను సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి అప్పటి కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ హైద్రాబాద్ కు వచ్చారు.

also read:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర: కమిటీకి ప్రణబ్ నేతృత్వం

సీఎల్పీ సమావేశానికి ముందే పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన సీఎల్పీ సమావేశంలో  సీఎల్పీ నేతను ఎంపిక చేసే ప్రక్రియలో పాల్గొన్నారు.

2010 నవంబర్ 10వ తేదీన జరిగిన సీఎల్పీ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నుకొన్నారు. ఈ విషయాన్ని ఈ సమావేశం తర్వాత ప్రణబ్ ముఖర్జీ స్వయంగా మీడియాకు ప్రకటించారు.ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు గులాం నబీ ఆజాద్, ఎకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ లు కూడ హాజరయ్యారు.

కిరణ్ కుమార్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక కావడంలో ప్రణబ్ కీలకపాత్ర పోషించినట్టుగా చెబుతారు. అప్పటికే జగన్ కి పలువురు మంత్రులు మద్దతుగా నిలిచారు. మరోవైపు కొండా సురేఖ జగన్ కి మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.